
చెరసాలలో ఉగ్రవాదులతో కుమ్మక్కు
బనశంకరి: ప్రమాదకర లష్కరే తోయిబా ఉగ్రవాదులతో ఓ పోలీస్ అధికారి, మానసిక వైద్యుడు, మహిళ కుమ్మక్కయ్యారు, వారి చేతిలో పావులుగా మారి దేశద్రోహానికి పాల్పడ్డారు, ఇది సినిమా కథ కాదు, బెంగళూరులో పేరుమోసిన పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జరుగుతున్న దందా. చివరకు ఎన్‌ఐఏ దాడుల్లో ముగ్గురు దుండగుల గుట్టు రట్టయింది.
నాసీర్ నెట్‌వర్క్
మంగళూరు కుక్కర్‌బాంబ్, శివమొగ్గ ఉగ్రకార్యకలాపాలు, బెంగళూరులో కెఫె పేలుడుతో పాటు అనేక ఉగ్రవాద ఘటనలతో ప్రముఖ లష్కరే ఉగ్రవాది టి.నాసీర్‌కు సంబంధాలున్నాయి. అతనితో లింకులు ఉన్న వైద్యుడు, ఏఎస్‌ఐ, మరో మహిళను ఎన్‌ఐఏ అధికారులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. ఉగ్రవాద కేసుల్లో నాసీర్ ఈ జైల్లోనే జీవితఖైదును అనుభవిస్తున్నాడు. పరప్పన జైలులో పనిచేసే మానసిక వైద్యుడు డాక్టర్ నాగరాజ్, జైలులోని ఏఎస్‌ఐ చాంద్‌పాషాలతో అనుమానిత ఉగ్రవాది తల్లి అనీశ్ ఫాతిమాతో నాసీర్ నిత్యం టచ్‌లో ఉన్నట్లు కనిపెట్టారు. ఇలా నాసీర్ ఊచల మధ్య నుంచే ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడైంది. కర్ణాటక, తమిళనాడు, కేరళలో స్లీపర్ సెల్స్‌తో సంబంధాలు కొనసాగిస్తూ బెంగళూరులో పెద్దఎత్తున విధ్వంసక చర్యలకు కుట్రపన్నాడనేది సమాచారం. గతంలో అరెస్టయిన ఉగ్ర అనుమానితులు జునైద్, మహమ్మద్ హర్షద్‌ఖాన్, సుహైల్, ఫైజల్, జాహిద్ తబ్రేజ్, ముదాసీర్ లకు కూడా డాక్టర్ నాగరాజ్, చాంద్‌పాషా, అనీస్ ఫాతిమా సహాయం చేస్తున్నారు. వీరూ పరప్పన జైల్లోనే ఉన్నారు.
ఏఎస్‌ఐ చాంద్‌పాషా..
2022 నుంచి నాసీర్‌తో ఏఎస్‌ఐ చాంద్‌పాషా కుమ్మక్కయ్యాడు. నాసీర్‌ను జైలు నుంచి వాయిదాల కోసం ఏయే కోర్టుకు తీసుకెళతారు అనే సమాచారం అతని సంబంధీకులకు లీక్ చేసేవాడు. పరారీలోనున్న ఉగ్రవాది జునైద్ అహ్మద్ తల్లి అనీస్ ఫాతిమా, నిరంతరం నాసీర్‌తో సంప్రదించేది. ఉగ్రవాదులకు నిధులు, శిక్షణ గురించి మాట్లాడుకునేవారు. ఆమె ఈ సమాచారాన్ని విదేశాల్లో ఉన్న కుమారుడు జునైద్ కు తెలిపేది.
నాగరాజు.. జైల్లో మొబైల్ వ్యాపారం
డాక్టర్ నాగరాజ్ నాలుగైదేళ్ల నుంచి పరప్పన జైలులో మానసిక వైద్యునిగా పనిచేస్తూ అక్రమాలకు నాంది పలికాడు. అతని అసిస్టెంట్ పవిత్ర కూడా తోడైంది. నాసీర్ తో పాటు ఖైదీలకు మొబైల్ స్మగ్లింగ్ చేసేవాడు. పవిత్ర పరారీలో ఉంది. నాగరాజు పరప్పన జైలులోకి దొంగచాటు మొబైల్‌ఫోన్స్ తీసుకెళ్లి రూ.10 వేల మొబైల్ ను రూ.50 వేలకు ఖైదీలకు విక్రయించేవాడు. ఇలా లక్షలాది రూపాయలను సంపాదించాడు. మొబైల్ కొనుగోలుదారుల నుంచి వాటిని ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. దేశాన్ని అస్థిరపరిచేలా పరప్పన జైలు లోపల సాగుతున్న కార్యకలాపాలను చూసి ఎన్‌ఐఏ అధికారులే దిగ్భాంత్రికి లోనయ్యారు.
6 రోజుల కస్టడీ
నాగరాజ్ , చాంద్‌పాషా, అనీస్ ఫాతిమా ఇళ్లు, సంబంధీకుల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు సాగిస్తోంది. ఫోన్లు, కంప్యూటర్లు వంటి ఉపకరణాలు, పుస్తకాలు, సీడీలు వంటి సామగ్రిని సేకరిస్తోంది. ఈ ముగ్గురినీ అనుమానిత ఉగ్రవాదులుగానే పేర్కొన్నారు. బుధవారం నగరంలోని సిటీ సివిల్ కోర్టులో హాజరుపరచగా కోర్టు 6 రోజుల పాటు ఎన్‌ఐఏ కస్టడీకి ఆదేశించింది. విచారణలో మరిన్ని నిజాలు వెల్లడి కావచ్చు.
పరప్పన జైలు మానసిక వైద్యుడు,
పోలీసు అరెస్టు
అనుమానిత ఉగ్రవాది తల్లి కూడా
ఎన్‌ఐఏ కార్యాచరణలో గుట్టురట్టు

చెరసాలలో ఉగ్రవాదులతో కుమ్మక్కు

చెరసాలలో ఉగ్రవాదులతో కుమ్మక్కు