ఎమ్మెల్యేపై భార్య, కూతురు ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేపై భార్య, కూతురు ఫిర్యాదు

Jul 10 2025 6:29 AM | Updated on Jul 10 2025 6:29 AM

ఎమ్మె

ఎమ్మెల్యేపై భార్య, కూతురు ఫిర్యాదు

దొడ్డబళ్లాపురం: చెన్నపట్టణ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్‌పై ఆయన భార్య, కుమార్తె కాంగ్రెస్‌ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. బెంగళూరుకు వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ రణదీప్‌ సుర్జేవాలాను భార్య మాళవిక సోలంకి, కుమార్తె నిషా కలిశారు. యోగేశ్వర్‌ తమను ఎంతో వేధింపులకు గురిచేస్తున్నారని, కేసులు పెడుతూ కోర్టుల చుట్టూ తిప్పుతున్నాడని తెలిపారు. ఆయన చర్యలతో తాము మానసికంగా ఎంతో క్షోభ అనుభవిస్తున్నామని, తమకు పార్టీ తరఫున న్యాయం చేయాలని కోరారు. కాగా యోగేశ్వర్‌ కుటుంబ కలహాలు గతంలోనూ రచ్చకెక్కాయి. ఎన్నికల సమయంలో ఆయన కూతురు తండ్రిపై పోటీకి సై అన్నారు. యోగేశ్వర్‌ శీలాకుమారి అనే ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు.

లంచగొండి పట్టివేత

కోలారు: నివేశనానికి ఈ–ఖాతా చేసివ్వడానికి వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఉండగా ముళబాగిలు నగరసభ ఎస్‌డిఎ ప్రశాంత్‌ లోకాయుక్త కు చిక్కారు. ఇతనిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వివరాలు.. నేర్నహళ్లి గ్రామానికి జయరాం అనే వ్యక్తి ఇంటి ఈ–ఖాతా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆ పని చేసివ్వడానికి ఎస్‌డిఎ ప్రశాంత్‌ రూ.6 వేల లంచం అడిగాడు. దీంతో జయరాం లోకాయుక్త అధికారులకు సమాచారమిచ్చాడు. బుధవారం ఆఫీసులో రూ.5 వేలు ముడుపు తీసుకుంటున్న సమయంలో లోకాయుక్త ఇన్స్‌పెక్టర్‌ అంజనప్ప, సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు.

బైక్‌లు ఢీ, హెచ్‌ఎం దుర్మరణం

శివమొగ్గ: రెండు బైక్‌లు ఎదురెదురు ఢీకొనడంతో ప్రధానోపాధ్యాయుడు మరణించగా, మరొకరికి గాయాలైన ఘటన జిల్లాలోని హొసనగర తాలూకా రిప్పన్‌పేటె పట్టణంలోని శివమందిరం వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది. మృతుడు అరసాళు గ్రామానికి చెందిన టీ.మంజయ్య (59) కాగా, కోటెతారిగ ప్రభుత్వ పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. పాఠశాలలో విధులు ముగించుకుని మంజయ్య బైక్‌పై ఇంటికి వెళుతుండగా ఎదురుగా వేగంగా వచ్చిన మరో బైకిస్టు ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన మంజయ్యను స్థానికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ రాజురెడ్డి సందర్శించి పరిశీలించారు. మంజయ్య మృతితో ఉపాధ్యాయులు, విద్యార్థులు విషాదానికి లోనయ్యారు.

మహిళపై సామూహిక అత్యాచారం

బనశంకరి: స్నేహితుల ఇంటికి వచ్చిన మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన నగరంలో పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. దొడ్డనాగమంగల సాయి లేఔట్‌లో స్నేహితుని ఇంటికి వచ్చిన మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. మహిళ వద్ద డబ్బు, మొబైల్‌ లాక్కుని ఉడాయించారు. ఈ ఘటన మూడురోజుల కిందట జరగ్గా, బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పౌర కార్మికులకు వాయనం

మైసూరు: శ్రీదుర్గా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా మైసూరు చాముండి కొండలో శ్రీచాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో మహిళా పౌర కార్మికులకు చీరలు, గాజులు, పసుపు, కుంకుమతో వాయనం సమర్పించారు. వారి సేవలను అభినందించారు.

షేర్ల పేరుతో రూ.34 లక్షల మస్కా

శివమొగ్గ: షేర్‌ మార్కెట్‌లో డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు గడించవచ్చని వాట్సాప్‌కు వచ్చిన సందేశాన్ని నమ్మి ఓ వ్యక్తి లక్షలాది రూపాయలను కోల్పోయిన ఘటన శివమొగ్గ నగరంలో వెలుగు చూసింది. వివరాలు.. బీబీ రోడ్డు నివాసి, 30 ఏళ్ల బాధితుని మొబైల్‌కు సైబర్‌ నేరగాళ్ల నుంచి ఓ వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది. తమ ద్వారా షేర్‌ మార్కెట్‌లో డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు గడించవచ్చని అందులో ఉంది. దీనిని నమ్మిన బాధితుడు దశల వారీగా వంచకుల బ్యాంకు ఖాతాలకు ఆన్‌లైన్‌ ద్వారా మొత్తం రూ.34.16 లక్షలను బదలాయించాడు. త్వరలోనే భారీ లాభం చూపిస్తామని నమ్మించారు. అయితే అతని నంబరును బ్లాక్‌ చేసి అందుబాటులో లేకుండాపోయారు. ఈ మోసంపై శివమొగ్గ సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.

ఎమ్మెల్యేపై భార్య, కూతురు ఫిర్యాదు 1
1/1

ఎమ్మెల్యేపై భార్య, కూతురు ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement