
ప్రాణం తీసిన ఓవర్‌టేక్
హుబ్లీ: బైక్‌ను బస్సు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన హుబ్లీ తాలూకా కుసుగల్ గ్రామం బ్యాహట్టి రోడ్డు శివారు ప్రాంతంలో చోటు చేసుకుంది. నవళగుంద తాలూకా అళగవాడి నివాసి బసవరాజ్ అళగవాడ గ్రామం నుంచి హుబ్లీ వైపు బైక్‌పై వెళ్తూ బస్సును ఓవర్ టెక్ చేసేందుకు యత్నించి అదుపు తప్పి పడిపోయాడు. తలపై బస్సు చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడని హుబ్లీ గ్రామీణ పోలీసులు తెలిపారు.
యువతకు
అర్థమయ్యేలా రచనలు
రాయచూరు రూరల్: యువతకు అర్థమయ్యేలా రచనలు చేయాలని సీనియర్ సాహితీ వేత్త శాశ్వతయ్య ముకుందమఠ్ అన్నారు. కవి తిమ్మయ్య శెట్టి రచించిన దైవం, ఏనుగుకు అంగి పుస్తకాలను కన్నడ భవనంలో జిల్లా, తాలూకా కన్నడ సాహిత్య పరిషత్ అధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు. భావితరాలకు కూడా ఇప్పటి రచనలు ఉపయోగపడాలన్నారు.
దొంగల అరెస్ట్,
నగలు స్వాధీనం
హుబ్లీ: చోరీ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. కుందగోళ తాలూకా గుడగేరి శ్రీధర్(27), హేమంత(34) గడిఫేర్నడేస్ (31)అనే నిందితులను హుబ్లీ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులనుంచి రూ.9 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తారిహళ గ్రామంలో సైదుసాబ్ నదాఫ్ ఇళ్లలోకి చొరబడి నగలు దోచుకున్నారు. అంచటగేరి మంజునాథ ఇంట్లో రూ.42 లక్షల విలువైన వస్తువులు చోరీ చేశారని ఎస్‌ఐ సచిన్ అలమేళకర తెలిపారు. దొంగలను అరెస్ట్ చేయడంలో ఏఎస్‌ఐ హొన్నప్పన్నవర, సిబ్బంది మల్లిగేవాడ, సంతోష్ చవాన్, గిరిష, విశ్వనాథ చాకచక్యంగా వ్యవహరించారన్నారు.
వీధిశునకాల దాడిలో
బాలుడికి గాయాలు
రాయచూరురూరల్: వీధి శునకాలు దాడి చేయడంతో నాలుగేళ్ల బాలుడు గాయపడ్డాడు. నగరంలోని 8వ వార్డు అంద్రూన్ కిల్లాలో రోహన్(4) అనే బాలుడు తన ఇంటి వద్ద ఆడుకుటుండగా శునకాలు దాడి చేశాయి. ముఖం, శరీరంపై పలుచోట్ల గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. రెండు నెలల క్రితం బైరూన్ కిల్లా, యల్‌బీఎస్ నగర్, అరబ్ మోహాల్లో వీధి శునకాలు దాడి చేసి పదిమందిని గాయపరిచాయి. అయినా కుక్కలను నియంత్రించడంలో నగరసభ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
రాయచూరురూరల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన ఆదివారం సింధనూరు తాలూకా తుర్విహళ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుండా గ్రామం వద్ద జరిగింది. దేవీ క్యాంప్‌నకు చెందిన కరణ కుమార్(27), సిందనూరుకు చెందిన రమేష్(28)లు బైక్‌పై వెళ్తుండగా గుండా గ్రామం వద్దకు రాగానే అదుపు తప్పి పడిపోయి తీవ్ర గాయాలతో మృతి చెందారు. మృతదేహాలను సింధనూరు ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ సుజాత తెలిపారు.
అగ్నిగుండంలో పడి తీవ్ర గాయాలు
రాయచూరురూరల్: మోహర్రం వేడుకల్లో అపశృతి జరిగింది. లింగసూగురు తాలూకా యరగుంటిలో శనివారం అగ్నిగుండం వెలిగించారు. అక్కడ అలాయ్ తొక్కుతుండగా హన్మంత్ నాయక్ అనే వ్యక్తి కాలుజారి గుండంలోకి పడిపోయాడు. తీవ్ర గాయాలైన అతన్ని ఆస్పత్రికి తరలించారు.
యోగాతో ఆరోగ్య సంరక్షణ
రాయచూరురూరల్: యెగాద్వారా ఆరోగ్యాలను పరిరక్షించుకోవచ్చని పతంజలి యోగా సంచాలకుడు విఠోభరావ్ అన్నారు. గురుపౌర్ణమిని పురస్కరించుకొని నగరంలోని మహిళా సమాజ్‌లో పతంజలి యోగా సంస్థ, సదర్ బజార్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి ఏర్పాటు చేసిన యోగా శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. యోగా, ధ్యానంతో వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు. యోగాను రోజువారి జీవితంలో భాగం కావాలన్నారు.

ప్రాణం తీసిన ఓవర్‌టేక్

ప్రాణం తీసిన ఓవర్‌టేక్