
మృతదేహంతో నిందితుడి ఇంటిఎదుట ధర్నా
హుబ్లీ: హాసన్ జిల్లా హరసికెరి రైల్వే పట్టాలపై రక్త గాయాలతో మృతి చెందిన నవ వివాహితది హత్య అని ఆరోపిస్తూ మృతురాలికుటుంబ సభ్యులు ఆరోపించారు. భర్త ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేశారు. వివరాలు....దావణగెరి జిల్లా చెన్నగిరి తాలూకా అనజి గ్రామ నివాసి విద్య (24)కు ఆరు నెలల క్రితం ఇదే తాలూకా సోమలాపుర గ్రామ నివాసి, కానిస్టేబుల్ శివుతో వివాహమైంది. దంపతులు బెంగళూరులో నివసించే వారు. అకస్మికంగా విద్య కనిపించకుండా పోవడంతో భర్త శివు గత నెల 30 బెంగళూరు శంకరపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదే రోజు హాసన్ జిల్లా అరసికెరె రైల్వే పట్టాలపై విద్య రక్తగాయాలతో కనిపించగా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఆమెది సహజ మరణం కాదని, కట్నం కోసం వేధించి హత్య చేశారని ఆరోపిస్తూ భర్త శివు, ఆయన తల్లి గాయత్రమ్మ, తండ్రి గుడప్ప, చెల్లెలు శిల్పపై హరసికెర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఆమెకు అంత్యక్రియలు చేయాలంటే తొలుత నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మృతురాలి బంధువులు శివు ఇంటి ఎదుట ధర్నా చేశారు. నిందితుడు శివును అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పడంతో ఆందోళన విరమించి అంత్యక్రియలు నిర్వహించారు.