
కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
● కార్మిక శాఖ మంత్రి సంతోష్‌లాడ్
సాక్షి,బళ్లారి: కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌లాడ్ పేర్కొన్నారు. నగరంలోని వాల్మీకి భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కార్మికుల సంక్షేమానికి కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తోందన్నారు. ఫ్యాక్టరీల్లో పనిచేసేవారే కాకుండా ఇతర అసంఘటిత రంగాల్లో పనిచేసేవారికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో 1.06 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. వారికి ఐడీకార్డులు పంపిణీ చేశామని, ప్రమాదంలో మృతి చెందితే బీమా కింద రూ. లక్ష అందజేస్తారన్నారు. డీజిల్, పెట్రోల్ సెస్ ద్వారా ఒకశాతం కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని సీఎంను కోరామన్నారు. రూ.150 కోట్లు లభించే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. కార్మికులు లేకపోతే అభివృద్ధి జరగదని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎంపీ తుకారం మాట్లాడుతూ కార్మికుల హిత రక్షణ కోసం మంత్రి సంతోష్‌లాడ్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యేలు నారా భరత్‌రెడ్డి, గణేష్ ,అధికారులు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం