
అంగన్‌వాడీ సరుకుల అక్రమ నిల్వ పట్టివేత
హుబ్లీ: అంగన్‌వాడీల్లో చిన్నారులకు అందించే పౌష్టిక ఆహారాన్ని అక్రమంగా ఓ గోడౌన్‌లో నిల్వ చేసిన ఇంటిపై పోలీసులు, ఆహార పౌర సరఫరాల శాఖ అధికారులు దాడి చేసి రూ.1,83,072 విలువ చేసే ఆహార సామగ్రిని స్వాధీనపరుచుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కలఘటిగి తాలూకా యలవదాళ నివాసి, అంగన్‌వాడీలకు ఆహార సామగ్రి సరఫరా చేసే చంద్రకాంత్ వడ్డరకర అనే వ్యక్తి ఇంటిపై దాడి చేశారు. బెల్లం 147 కేజీలు, బియ్యం 882 కేజీలు, పిల్లల ఆహార కుస్తీ కిట్ 1058 కేజీలు, మిల్లెట్ లడ్డు మిశ్రమం 679 కేజీలు, గోధుమ నూక 566 కేజీలు, మిల్లెట్ లాడ్ 1411 కేజీలు, రవ్వ 1608 కేజీలను పట్టుకున్నారు. ఇవి ప్రభుత్వం నుంచి ఉచితంగా సరఫరా చేసి అంగన్‌వాడీ చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు అందిస్తారు. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచారన్న ఆరోపణలపై కలఘటిగి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీఐ శ్రీశైల కౌజలిగి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. కాగా ఈ అక్రమ నిల్వపై దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని తాలూకా పీడీపీఓ విద్యా బడిగేర్ ఓ ప్రకటనలో తెలిపారు.
సీఎంతో అవమానం..
వీఆర్‌ఎస్‌కు ఏఎస్పీ వినతి
హుబ్లీ: కార్యక్రమం వేదికపై సీఎం సిద్దరామయ్య చేతిలో అవమానానికి గురైన ఏఎస్పీ నారాయణ భరమని స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బెళగావిలో జరిగిన కార్యక్రమ వేదికపై సీఎం సిద్దరామయ్య ఏఎస్పీ నారాయణ భరమనిని కొట్టేంత పని చేశారు. ఈ ఘటనతో మనోవేదనకు గురై ఆయన ఈ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కాగా ఆయన చేసిన ఈ విజ్ఞప్తిపై సీఎం సమక్షంలోనే నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. దీంతో నారాయణ కొంచెం శాంతించినట్లుగా చెబుతున్నారు. కాగా ఈ అధికారి వీఆర్‌ఎస్ నిర్ణయంతో ప్రభుత్వంపై కాసింత ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండనుందని భావిస్తున్నారు.
రాయల విగ్రహం పేరుతో రూ.లక్ష దోపిడీ
రాయచూరు రూరల్: మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వాముల విగ్రహం ఏర్పాటు విషయంలో చందాలు ఇవ్వాలంటూ ఏకంగా భక్తులకు రూ.1.15 లక్షల నిధులు డ్రా చేసుకొని ఉడాయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగల్ మాట్లాడుతూ మంత్రాలయం రాఘవేంద్ర స్వాముల 253 అడుగుల విగ్రహాన్ని సురేష్ అనే వ్యక్తి రామనగర వద్ద బెంగళూరు–మైసూరు జాతీయ రహదారిపై నిర్మిస్తున్నట్లు తెలిపారు. 96119 09961కు భక్తులు రూ.1.15 లక్షలు ఫోన్‌పే ద్వారా డబ్బులు వేయించుకొని అనంతరం ఫోన్ ఎత్తకుండా పోవడంతో సైబర్ నేర పరిశోధన కేంద్రానికి కేసు బదిలీ చేశామన్నారు. భక్తులు ఎవరి మాటలకు, దుష్ప్రచారాలకు తలొగ్గకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.
రెండో రోజూ
కొనసాగిన తనిఖీలు
రాయచూరు రూరల్: నగరంలో రెండో రోజు 300 ఆటోలను చెక్ చేసినట్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఈరేష్ నాయక్ వెల్లడించారు. బుధవారం మహిళా కళాశాల వద్ద ఆటో డ్రైవర్లకు లైసెన్సులు, పర్మిట్లు, ఆర్సీ, ఇతర బ్యాడ్జీలు, ఆటోలకు ఎలాంటి పర్మిషన్లు లేవని తేలిందన్నారు. వాటన్నింటిని తనిఖీ చేసి సీల్ వేశామన్నారు. ఆర్‌టీఓ కార్యాలయంలో వీటిని పరిశీలించిన అనంతరం ఆటోలను యజమానులకు అప్పగిస్తామన్నారు. నగరంలో దాదాపు 80 శాతం ఆటోలకు ఇన్సూరెన్సులు, ఇతరత్ర పత్రాలు లేవని అన్నారు.
ఆశా కార్యకర్తల ధర్నా
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు నెలకు రూ.10 వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించాలని రాష్ట్ర ఆశా కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో ఆందోళన చేపట్టిన అధ్యక్షుడు వీరేష్ మాట్లాడారు. కేంద్ర సర్కార్ ఇచ్చే ప్రోత్సాహ ధనాన్ని కలిపి వేతనాలు చెల్లించాలని వివరించారు. భవిష్యత్తులో 40 వేల మంది అశా కార్యకర్తలకు నెలకు రూ.15 వేలు చొప్పున గౌరవ వేతనాలు ఇవ్వడానికి ప్రభుత్వం స్పందించాలన్నారు. తొలగించిన ఆశా కార్యకర్తలు, సూపర్ వైజర్‌లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. నెల నెలా తప్పకుండా వేతనాలు అందించేలా చూడాలని కోరుతూ జిల్లాధికారి ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.

అంగన్‌వాడీ సరుకుల అక్రమ నిల్వ పట్టివేత

అంగన్‌వాడీ సరుకుల అక్రమ నిల్వ పట్టివేత