
హైకోర్టు సూచనతో నాగేంద్రకు బిగ్‌షాక్
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బళ్లారి జిల్లా నుంచి ఏకై క మంత్రిగా కేబినెట్‌లో చోటు దక్కించుకోవడంతో పాటు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకుని, జిల్లాలో తిరుగులేని నాయకుడుగా ఎమ్మెల్యే బీ.నాగేంద్ర ఎదిగారు. అయితే వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల మేర అవినీతి జరగడం, ఆ శాఖకు ఆయన మంత్రిగా ఉండటంతో పాటు ఆయన ప్రమేయంతోనే అవినీతి జరిగిందనే ఆరోపణలపై మంత్రి పదవిని కోల్పోవడంతో పాటు ఆయన జైలుకు కూడా వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. కంచే చేను మేసిన చందంగా తన వర్గానికి చెందిన వారి సంక్షేమం కోసం కేటాయించిన నిధులు పక్కదారి పట్టడంతో రాష్ట్రంలో కలకలం రేపింది. పట్టుమని ఏడాది పాటు కూడా మంత్రిగా పని చేయని నాగేంద్ర అవినీతి ఊబిలో కూరుకుపోయారు.
గోరు చుట్టుపై రోకటి పోటులా..
జైలుకు కూడా వెళ్లి వచ్చిన తర్వాత ఇందులో తన తప్పేమీ లేదని, తిరిగి మంత్రి పదవిని చేపడతానని ఆయన తన వర్గీయులతో పదే పదే చెబుతున్న తరుణంలో గోరు చుట్టుపై రోకటి పోటులా హైకోర్టు సూచనతో ఆయన మెడకు ఉచ్చు బిగుసుకుంటోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల మేర అవినీతి జరిగిన తర్వాత ఆ నిధులను 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బళ్లారి లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు ఖర్చు పెట్టారనే ఆరోపణలు కూడా ఉండటంతో పాటు ఎస్‌ఐటీ అధికారులు ఆ మేరకు విచారణ కూడా చేస్తున్నారు. బీజేపీ ఈ విషయాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తి ఇరుకున పెట్టిన సంగతి తెలిసిందే. నాగేంద్ర ప్రమేయంతో అవినీతి జరిగిందని, దానిపై ఆయన జైలుకు వెళ్లిన తరుణంలో పార్టీ ఆయనకు అండగా ఉంది. మళ్లీ మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ కూడా సానుకూలంగా ఉండటంతో ఖచ్చితంగా నాగేంద్రకు మంత్రి పదవి దక్కుతుందని జిల్లాలో ముఖ్యంగా ఆయన అనుచరవర్గాల్లో చర్చ నడుస్తోంది.
సీబీఐ ఎంట్రీతో అక్కమార్కుల్లో దడ
అయితే బ్యాంకు విచారణకే పరిమితమైన సీబీఐతో సమగ్ర తనిఖీ చేయాలని కోరుతూ ఎమ్మెల్యేలు బసవనగౌడ పాటిల్ యత్నాళ్, రమేష్ జార్కిహోళి తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎస్‌ఐటీ, ఈడీ విచారణ చేస్తున్న తరుణంలో హైకోర్టు సూచనతో సీబీఐ కూడా ఎంట్రీ ఇస్తుండటంతో అవినీతిలో కూరుకుపోయిన వారి గుండెల్లో దడ మొదలైంది. ఎస్‌ఐటీ నుంచి క్లీన్‌చిట్ పొందిన నాగేంద్ర మళ్లీ మంత్రి అవుతానని కలలు కంటున్నారు. అయితే సీబీఐ విచారణకు రానుండటంతో ఏం జరుగుతుందోనని చర్చనీయాంశంగా మారింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఇప్పటికే మహర్షి వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల గోల్‌మాల్‌లో ఎవరెవరి పాత్ర ఉందో నిధులు స్వాహా చేసిన నేతలకు తెలుసు. ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలిచారని బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సీబీఐ తనిఖీ చేసిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు.
మళ్లీ మంత్రి అయ్యే యోగం ఇప్పట్లో లేనట్లేనా?
సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని ఎస్‌ఐటీకి ఆదేశం
వాల్మీకి మండలి అవినీతి కుంభకోణం కేసులో మలుపు