బైక్‌ ట్యాక్సీలు షెడ్డుకేనా? | - | Sakshi
Sakshi News home page

బైక్‌ ట్యాక్సీలు షెడ్డుకేనా?

Jul 2 2025 6:46 AM | Updated on Jul 2 2025 6:46 AM

బైక్‌

బైక్‌ ట్యాక్సీలు షెడ్డుకేనా?

సాక్షి బెంగళూరు: బెంగళూరులో గత నెల 16వ తేదీ నుంచి బైక్‌ ట్యాక్సీ సేవలపై నిషేధం విధించారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్షకు పైగా బైక్‌ ట్యాక్సీలు బంద్‌ అయినట్లు అంచనా. బైక్‌ ట్యాక్సీ కేవలం ఒక రవాణా సాధనం మాత్రమే కాదని, మా మంచి భవిష్యత్తుకు ఒక భరోసా అని వేలాది మంది బైక్‌ట్యాక్సీదారులు సర్కారుకు విజ్ఞప్తి చేస్తూ నిషేధాన్ని సడలించాలని కోరారు. కొన్నిచోట్ల నిరసనలు కూడా నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కన్నడనాట నిషేధించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త మోహన్‌దాస్‌ పై కూడా ఎక్స్‌లో వారికి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెచ్చగొట్టేలా ట్వీట్‌ చేయడం వల్ల బైక్‌ ట్యాక్సీ డ్రైవర్లు ఆందోళన చేశారని ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాలను మీరి సుమారు 200కు పైగా బైక్‌ ట్యాక్సీదారులు విధుల్లోకి రాగా, పోలీసులు ఆ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

చార్జీల బాదుడు

ఇప్పుడు ప్రత్యామ్నాయం లేక ప్రజలు ఆటో, క్యాబ్‌లలో ప్రయాణం సాగిస్తున్నారు. వాటికి గిరాకీ గణనీయంగా పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని యాప్‌ ఆధారిత ఆటోలు, సాధారణ ఆటోవాలాలు అధిక చార్జీలను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బైక్‌ ట్యాక్సీల నిషేధం తర్వాత ఏకాఎకి మూడు రెట్లు చార్జీలను పెంచినట్లు పలువురు ప్రయాణికులు తెలిపారు. రవాణా శాఖ ఆటో రిక్షాలకు తొలి రెండు కిలోమీటర్లకు రూ. 30 ఆ తర్వాత ఒక్కో కిలోమీటర్‌కు రూ. 15 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. ప్రముఖ యాప్‌ ఆటోలు తుంగలో తొక్కి మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నాయి. ఫిర్యాదులు పెరగడంతో రవాణా అధికారులు తనిఖీలు ప్రారంభించారు.

నిషేధంతో వేలాదిమంది గగ్గోలు

ఆటోల్లో పెరిగిన చార్జీల భారం

ప్రజలు ఏమంటున్నారు?

బెంగళూరులో తక్కువ ఖర్చుతో గమ్యం చేరడానికి బైక్‌ ట్యాక్సీలు అనువుగా ఉండేవని పలువురు నగరవాసులు పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతి రోజూ ప్రయాణ ఖర్చు పెరుగుతోందని చెప్పారు. ట్రాఫిక్‌లో సులభంగా వెళ్లే అవకాశం ఉండేదని అన్నారు. ఆటోలు, క్యాబుల్లో అధిక ధరలు వసూలు చేస్తుండడంతో తమకు ఆర్థిక భారంగా మారిందని సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులు తెలిపారు. ఆటోడ్రైవర్ల సంఘాలు మాత్రం వాటిని నిషేధించాలని, లేకుంటే తమకు ఉపాధి ఉండదని పట్టుబట్టాయి. కాగా బైక్‌ ట్యాక్సీల మీద పలు ఆరోపణలున్నాయి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని అనేక కేసులున్నాయి. బైక్‌ ట్యాక్సీల భవిష్యత్తు ఏమిటనేది సందిగ్ధంలో ఉంది.

బైక్‌ ట్యాక్సీలు షెడ్డుకేనా?1
1/4

బైక్‌ ట్యాక్సీలు షెడ్డుకేనా?

బైక్‌ ట్యాక్సీలు షెడ్డుకేనా?2
2/4

బైక్‌ ట్యాక్సీలు షెడ్డుకేనా?

బైక్‌ ట్యాక్సీలు షెడ్డుకేనా?3
3/4

బైక్‌ ట్యాక్సీలు షెడ్డుకేనా?

బైక్‌ ట్యాక్సీలు షెడ్డుకేనా?4
4/4

బైక్‌ ట్యాక్సీలు షెడ్డుకేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement