
ఉడ్తా కర్ణాటక కానివ్వం
శివాజీనగర: రాష్ట్రంలో గత సంవత్సరంలో నాలుగు వేల కేజీల గంజాయితో పాటుగా రూ.45 కోట్ల విలువ చేసే వివిధ తరహాల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొన్నాం. ఈ దందాలో పాల్గొంటున్న 200 మంది విదేశీయులను వారి దేశాలకు పంపించామని హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. ప్రపంచ డ్రగ్స్, మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా గురువారం బెంగళూరు నగర పోలీస్ ద్వారా కంఠీరవ క్రీడా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విచ్చలవిడి డ్రగ్స్ వాడకం వల్ల పంజాబ్‌ను ఉడ్తా పంజాబ్ అని పిలుస్తున్నారు. ఉడ్తా కర్ణాటక కానివ్వబోము అని చెప్పారు. డ్రగ్స్ వల్ల మనిషికి శారీరకంగా, మానసికంగా దుష్పరిమాణాలను అర్థం చేసుకోవాలన్నారు. మాదక వ్యసనానికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోరాదన్నారు. డ్రగ్స్ దందాను చట్టం ద్వారా అడ్డుకోలేం, యువకుల మనస్సును జాగృత పరచాలని చెప్పారు. డ్రగ్స్ రవాణా, వాడకం అడ్డుకట్టకు మరిన్ని కఠిన చర్యలను తీసుకుంటామని తెలిపారు. ప్రతి కాలేజీలో డ్రగ్స్ వ్యతిరేక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. మత్తు వ్యాపారం గురించి తెలిసిన తక్షణమే ప్రజలు పోలీసులకు సమాచారమిచ్చి సహకరించాలని విన్నవించారు. ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ నిల్వలను నాశనం చేసే కార్యక్రమాన్ని ఆరంభించారు. ప్రజలు సమాచారం అందించడానికి రక్ష క్యూ ఆర్ కోడ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్, డీజీపీ ఎం.ఏ.సలీం, ఐపీఎస్‌లు పాల్గొన్నారు. కాగా, బెంగళూరుతో పాటు అన్ని జిల్లాల్లో విద్యార్థులు జాగృతి ర్యాలీలను నిర్వహించారు.
డ్రగ్స్ అడ్డుకట్టకు చర్యలు
హోంమంత్రి పరమేశ్వర్