హుబ్లీ: సద్గురువు జగ్గి వాసుదేవ్ శివరాత్రి రోజున దేశ రాజకీయాల గురించి మాట్లాడకుండా ఉండాల్సిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంతోష్ లాడ్ తెలిపారు. ధార్వాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాలను సద్గురువులు ప్రస్తావించారని గుర్తించారు. రాజకీయాలు మాట్లాడాలనుకుంటే బహిరంగంగా చర్చించాలి. శివరాత్రి రోజు రాజకీయ విషయాలపై చర్చ ఎంత వరకు సబబు? అని, అది ఎంత తప్పో ఆయన తెలుసుకోవాలని అన్నారు. సద్గురువులకే ఎంతో అభిమాన బలగం ఉందన్నారు. నేను కూడా ఆయన అభిమానినే. అభిమానులు ఉన్నప్పుడు ఆయన మాట్లాడతారు. శివరాత్రి పండుగ రోజు రాజకీయ విషయాలు మాట్లాకుండా ఉండాల్సింది. ఆయన అలా మాట్లాడటం సరికాదని తన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. గృహలక్ష్మీ డబ్బుల పంపిణీలో జాప్యంపై కేంద్ర మంత్రి జోషి విమర్శలను ఆయన తిప్పికొట్టారు. రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసిందన్న జోషి వ్యాఖ్యలు చేసే ముందు కేంద్ర ప్రభుత్వం ఏమైందో స్పష్టం చేయాలన్నారు. ఆయన ఈ రాష్ట్రానికి చెందిన వారు. ప్రతి సారి రాష్ట్ర ప్రభుత్వంపై దాడి చేసి పోతారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత బడ్జెట్ ప్రతిపాదించిన కర్ణాటకకు, ధార్వాడ జిల్లాకు కాని ఎంత మేర నిధులు తెచ్చారో జోషి స్పష్టం చేయాలన్నారు.
రెండు నెలలు ఆలస్యమేతై దివాళానా?
రెండు నెలలు గృహలక్ష్మీ డబ్బులు వేయక పోతే దివాళా తీసిందని చెప్పే ఈయన కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడాలని అన్నారు. దేశంలో ఎవరు అబద్ధాలు చెబుతున్నారు. ఎవరిది మందపాటి చర్మం అన్నది ప్రజలకు తెలుసు అన్నారు. నల్లధనం తెస్తామని, దేశంలోని ప్రతి వ్యక్తి బ్యాంక్ ఖాతాకు రూ.15 లక్షలు జమా చేస్తామన్నారు. నూరు బుల్లెట్ ట్రైన్‌లు వస్తాయంటూ వందలకొద్ది ఒట్టి హామీలు ఇచ్చారన్నారు. కేవలం కాంగ్రెస్ సర్కారుపై మాట్లాడటం తగదన్నారు. కేంద్రంలో మోదీ సర్కారు ఇచ్చిన హామీల గురించి జోషి మాట్లాడాలని లాడ్ సవాల్ విసిరారు. రాష్ట్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు గురించి అడిగిన ప్రశ్నకు స్పందించిన లాడ్ కొన్ని శాఖలకు నిధులు అడిగామన్నారు. అందులో ముఖ్యంగా ధార్వాడ జిల్లాకు ఎక్కువ నిధులు ఇవ్వాలని అడిగాం. కార్మిక శాఖకు తగినన్ని నిధులు కావాలని కోరామన్నారు. తనకు ఇప్పుడు 50 ఏళ్లు. తాను ఒక లక్కీ రాస్కెల్, ఇప్పటికే ఎన్నో ఏళ్లు రాజకీయ జీవితం గడిపాను. తండ్రిని పోగొట్టుకున్నా ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చానని లాడ్ తన మనోగతాన్ని వెలిబుచ్చారు.
కలఘటిగి ప్రజల రుణం మరిచిపోను
రాజకీయాల్లోకి తను డబ్బు సంపాదనకు రాలేదు. తన వల్ల వేలాది మందికి ఉపయోగం కావాలి. రాజకీయ వ్యవస్థ మారాలి. సామాజిక న్యాయం ఇవ్వాలన్న సత్సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌లాడ్ అన్నారు. కలఘటిగిలోని మడికి హొన్నళ్లి అమృత నివాసంలో సంతోష్‌లాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన 50వ జన్మదిన శుభ వేళ ఆ తాలూకాలోని 10వ తరగతి విద్యార్థులకు విద్యాభ్యాసానికి ప్రోత్సాహధనం, ఆశ గ్రామ పంచాయతీ సఖి మహిళలకు రూ.3 వేల ధన సహాయం పంపిణీతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. ఇటీవల కొన్ని సోషల్ మీడియాల్లో వస్తున్న అసత్య వార్తలను యువత పట్టించుకోరాదన్నారు. కలఘటిగి, అళ్నావర క్షేత్రాలు తనకు రాజకీయ పునర్జన్మ ఇచ్చిన స్థానాలన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు మీ రుణాన్ని తీర్చుకుంటానన్నారు. రాబోయే రోజుల్లోలో ఈ ప్రాంత ప్రజలతోనే ఉండి మీ సమస్యలు పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. వివిధ కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని అలరించాయి. హన్నెరడు మఠం రేవణసిద్ద శివాచార్య స్వామీజీ సానిధ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాధికారిణి దివ్యప్రభు, జిల్లా ఎస్పీ గోపాల బ్యాకోడ్, జెడ్పీ సీఈఓ భువనేష్ పాటిల్, తహసీల్దార్ వీరేష్, తదితరులు పాల్గొన్నారు.
సద్గురువు అలా మాట్లాడాల్సింది కాదు
జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంతోష్ లాడ్