ఏనుగును చంపిన కేసులో మరో వ్యక్తి అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

ఏనుగును చంపిన కేసులో మరో వ్యక్తి అరెస్ట్‌

Published Tue, Nov 14 2023 1:00 AM

విశేష అలంకరణతో             వేల్‌మురుగన్‌ మూలవిరాట్‌ - Sakshi

కెలమంగలం: జవుళగిరి అటవీ ప్రాంతంలో నాటుతుపాకీతో ఏనుగును చంపిన ఘటనలో పరారీలో ఉన్న మరో నిందితున్ని తళి పోలీసులు అరెస్ట్‌ చేశారు. జవుళగిరి సమీపంలోని షణ్మాళం అటవీ ప్రాంతంలో గత నెల 29వ తేదీ ఏనుగును కాల్చి చంపినట్లు స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అటవీ సిబ్బంది, తళి పోలీసులు, పశువైద్యులతో ఘటనా స్థలానికి చేరుకొని మృతి చెందిన ఏనుగు కళేబరానికి పరీక్షలు నిర్వహించి అక్కడే ఖననం చేశారు. తళి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేయగా షణ్మాళం గ్రామానికి చెందిన రైతు ముత్తుమల్లేష్‌, కర్ణాటక రాష్ట్రం కనకపుర తాలూకా కాడుశివనపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసమూర్తి కలిసి రాగి పంటలపై దాడి చేస్తున్న ఏనుగును నాటుతుపాకీతో కాల్చిచంపినట్లు తెలిసింది. ముత్తు మల్లేష్‌ను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న శ్రీనివాసమూర్తిని ఆది వారం రాత్రి అరెస్ట్‌ చేశారు.

కందషష్ట్టి ఉత్సవం ప్రారంభం

హోసూరు: హోసూరు కార్పొరేషన్‌ పరిధి పెరియార్‌ నగర్‌లో వెలసిన ప్రసిద్ది పొందిన వేల్‌మురుగన్‌ ఆలయంలో సోమవారం నుంచి కందషష్ట్టి ఉత్సావాలు ప్రారంభమయ్యాయి. ఆరు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సోమవారం ఉదయం కలశ స్థాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుబ్రమణ్య సహస్ర నామం, నవయాగశాల పూజలు, పూర్ణాహుతి, దీపారాధన తదితర కార్యక్రమాలను ఆరు రోజుల పాటు అనుసరిస్తున్నట్లు, సూరసంహారంతో కార్యక్రమం ముగుస్తుందని ఆలయ కమిటీ తెలిపింది. సోమవారం ప్రారంభమైన కార్యక్రమంలో మురుగన్‌ మూలవిరాట్‌ను అభిషేకించి విశేష పూజలు జరిపించారు. పెద్ద ఎత్తున భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

పారిశుధ్య కార్మికులకు కానుకలు

హోసూరు: హోసూరు కార్పొరేషన్‌లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు కార్పొరేషన్‌ కమిషనర్‌ స్నేహ బహుమతులను అందజేశారు. పట్టణంలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ, కలుషితాలను తొలగించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఒక్క పారిశుధ్య కార్మికుల వల్లనే సాధ్యమని ప్రశంసించారు. హోసూరు జనాభా పెరగడం వల్ల పారిశుధ్య సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు. డిప్యూటీ మేయర్‌ ఆనందయ్య, ఎన్‌.ఐఎస్‌.మాదేశ్వరన్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement