పొగాకును అరికడదాం | Sakshi
Sakshi News home page

పొగాకును అరికడదాం

Published Wed, Jul 5 2023 1:26 AM

బోల్తా పడిన కారు  
 - Sakshi

రాయచూరు రూరల్‌: నేటి ఆధునిక సమాజంలో పొగాకు నియంత్రణకు సహకరించాలని జిల్లా మానసిక రోగ వైద్య నిపుణుడు మనోహర్‌ పత్తార్‌ పిలుపు ఇచ్చారు. మంగళవారం దేవదుర్గ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రపంచ పొగాకు నియంత్రణ దినోత్సవంలో మాట్లాడారు. దురలవాట్లకు లోనై జీవితాలను నాశనం చేసుకోరాదన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖాధికారులున్నారు.

టైర్‌ పేలి కారు బోల్తా

కుటుంబానికి తప్పిన ప్రమాదం

బళ్లారిఅర్బన్‌: తాలూకాలోని మోకా ఫారెస్ట్‌ వద్ద మంగళవారం సాయంత్రం టైరు పేలి కారు అదుపు తప్పి బోల్తా పడగా, త్రుటిలో ప్రమాదం నుంచి కుటుంబం క్షేమంగా బయట పడిన ఘటన జరిగింది. హొసపేటెకు చెందిన కొత్త పెళ్లి జంట తమ తల్లిదండ్రులతో కలిసి మంత్రాలయం, ఉరుకుంద ఈరణ్ణ స్వామి దర్శనం చేసుకొని తిరిగి బళ్లారి మీదుగా హొసపేటెకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. గమనించిన స్థానికులు అక్కడికి చేరి కారులో ఉన్న నలుగురిని బయటకు తీశారు. ఈ ఘటనపై మోకా పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పరశురాం తెలిపారు.

భూములు పంచాలని ధర్నా

రాయచూరు రూరల్‌: జిల్లాలో భూమి లేని పేదలకు ప్రభుత్వం మిగులు భూములను పంపిణీ చేయాలని కర్ణాటక ప్రాంత రైతు కూలీ సంఘం డిమాండ్‌ చేసింది. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనను ఉద్దేశించి అధ్యక్షుడు కరియప్ప మాట్లాడారు. తాలూకాలోని ఉండ్రాలదొడ్డి, బాపుర, మాసదొడ్డి, ఎల్‌కే దొడ్డి, మండలగేరి, అరసికెర, యరగేర, చంద్రబండ, యాపలదిన్ని జీపీ అధికారులు గ్రామాల్లో సర్వే చేసి భూములును పంచాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

ఘనంగా స్నాతకోత్సవం

బొమ్మనహళ్లి: నగరంలో ఎలక్ట్రానిక్‌ సిటీలో ఉన్న ఇంటర్‌నేషనల్‌ ఇన్సిటిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ– ఐఐఐటిలో 23వ స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. 322 మంది వివిధ కోర్సుల పట్టభద్రులకు ఢిల్లీలోని ఐఐఐటి చెందిన డైరెక్టర్‌ రంగన్‌ బెనర్జీ పట్టాలను బహూకరించారు. శామ్‌సంగ్‌ ఎం.డి. బాలాజి సౌరిరాజన్‌, క్రిస్‌ గోపాలక్రిష్ణన్‌, దేబబ్రత్‌ దాస్‌ పాల్గొన్నారు.

నీటి ట్యాంక్‌లో పడి కోతుల మృతి

రాయచూరు రూరల్‌: జిల్లాలోని దేవదుర్గ తాలూకా ఖానాపురలోని తాగునీటి ట్యాంక్‌లో రెండు కోతులు పడి మరణించిన ఉదంతం వెలుగు చూసింది. మంగళవారం ఖానాపురలో తాగునీటి ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి వెళ్లిన హేమనాళ జీపీ సిబ్బంది వాటిని గమనించారు. ఇటీవలే ఈ కోతులు ట్యాంకులో పడి మరణించి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. గ్రామస్తులు దుర్వాసనతో కూడిన నీటిని తాగామని వాపోయారు. అయితే గ్రామంలో ఎలాంటి దుష్పరిణామాలు ఎదురు కాలేదని జెడ్పీ సీఈఓ శశిధర్‌ తెలిపారు. కాగా గ్రామంలోని ఓవర్‌హెడ్‌ నీటి ట్యాంక్‌ను పరిశీలించి జీపీ అధికారులు, సిబ్బంది పని తీరుపై మండిపడ్డారు.

Advertisement
Advertisement