పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత
● కరీంనగర్ సీపీ గౌస్ ఆలం
కరీంనగర్‌క్రైం: గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. కమిషనరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం సీపీ గౌస్ ఆలం పోలీసు అధికారులందరితో సమీక్ష సమావేశం నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. సీపీ మాట్లాడుతూ ఎన్నికల బందోబస్తు ప్రణాళిక అమలుపై స్టేషన్ హౌస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమస్యాత్మక కేంద్రాలు, ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలీసు బలగాలను కేటాయించాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు, కమిషనరేట్ పరిధిలోని రౌడీషీటర్ల బైండోవర్ పూర్తి చేశామని పేర్కొన్నారు. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు శ్రీనివాస్, మాధవి, విజయకుమార్, వెంకటస్వామి, యాదగిరిస్వామి, వేణుగోపాల్, వాసాల సతీశ్, ఇతర అధికారులు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.


