అర్బన్ ఎన్నికలకు ఏర్పాట్లు!
అర్బన్ బ్యాంకు ఎన్నికల తీరిలా
మధ్యాహ్నం 2 గంటల
వరకే పోలింగ్
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 12 డైరెక్టర్ పోస్టులకు గానూ 54మంది పోటీ చేస్తుండగా ప్రచారం ముగిసింది. 13రోజుల పాటు తమను గెలిపించాలని ప్రచారం చేసిన అభ్యర్థులు ప్రలోభాలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల అధికారి సీహెచ్ మనోజ్ కుమార్ ప్రత్యేకంగా పర్యవేక్షించారు. శనివారం పోలింగ్ జరగనుండగా కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, జగిత్యాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం కరీంనగర్‌లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సరంజామా అందజేయగా, సాయంత్రమే కేంద్రాలకు చేరుకున్నారు.
మూడు బ్యాలెట్లతో పోలింగ్
తొలిసారిగా మూడు బ్యాలెట్లతో ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. శుక్రవారం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద మరోసారి వివరించారు. పాలకవర్గంలో మొత్తం 12 మంది డైరెక్టర్లను బ్యాంకు సభ్యులు ఎన్నుకోనున్నారు. ప్రతీ సభ్యుడు బ్యాలెట్ పేపర్ ద్వారా 12 మందికి ఓటు వేయాల్సి ఉంటుంది. ఇందులో మహిళలకు 2 డైరెక్టర్ పదవులు కాగా.. మరో స్థానాన్ని ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి రిజర్వ్ చేసిన విషయం విదితమే. మిగతా 9 స్థానాలకు ఓపెన్ కేటగిరీలో ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఒకే బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించగా.. ఈసారి మాత్రం 3 కేటగిరీలకు 3 బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తున్నారు. ఓపెన్ కేటగిరీకి తెల్ల బ్యాలెట్ పేపర్, మహిళా కేటగిరీకి గులాబీ రంగు బ్యాలెట్ పేపర్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి నీలిరంగు బ్యాలెట్ పేపర్ వినియోగించనున్నారు.
ఉత్కంఠగా సాగనున్న ఓట్ల లెక్కింపు
శనివారం సాయంత్రం 4గంటలకే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుండగా ఎమ్మెల్సీ ఓట్ల మాదిరిగా లెక్కింపు సాగనుంది. అత్యధిక ఓట్లు వచ్చిన వారితో పాటు వారికన్నా తక్కువగా వచ్చినవారిని గుర్తిస్తూ 12మంది డైరెక్టర్లు గెలిచినట్లుగా అధికారులు ప్రకటించనున్నారు.
మేమే గెలుస్తాం.. మేమే గెలుస్తాం
బ్యాంకు ఎన్నికలు 8 ఏళ్ల అనంతరం జరుగుతుండగా అభ్యర్థుల ప్రచారం రసవత్తరంగా సాగింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో త్రిముఖ పోటీ నెలకొంది. మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్, తాజా మాజీ చైర్మన్ గడ్డం విలాస్‌రెడ్డి ప్యానెళ్లు అమీతుమీకి సిద్ధమవుతుండగా మార్పు కోసం మన ప్యానెల్ అంటూ నిర్మల భరోసా పేరుతో వెలిచాల వర్గం గట్టి పోటీ ఇస్తోంది. మూడు ప్యానెళ్లు కాకుండా ఓటర్లు తమకే పట్టం కడతారని స్వతంత్ర అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం ఓటర్లు: 9,287
కరీంనగర్ ఓటర్లు: 7,272
జగిత్యాల ఓటర్లు: 2,015
పోలింగ్ కేంద్రాలు: 02
పోలింగ్ బూత్‌లు: 31
కరీంనగర్‌లో : 24, జగిత్యాలలో : 07
అర్బన్ బ్యాంక్ ఎన్నికలు కాస్త భిన్నంగా జరుగుతాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్ జరగనుంది. 2గంటల వరకు బూత్‌లో ఉన్న ఓటర్లు ఓటు వేసేవరకు అవకాశముంటుంది. సాయంత్రం 4గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎన్నికల అధికారిగా సీహెచ్ మనోజ్ కుమార్ వ్యవహరిస్తుండగా అబ్జర్వర్లుగా రామకృష్ణ, శ్రీమాల, అడిషనల్ ఎలక్షన్ అథారిటీగా కరీంనగర్ డీసీవో రామానుజాచార్య వ్యవహరిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని వివరించారు.
అర్బన్ ఎన్నికలకు ఏర్పాట్లు!


