
మాటల ఈటెలు!
● సొంత పార్టీ నేతలపై ఘాటైన విమర్శలు ● ఈటలతో సమావేశమైన 132 మందికి బీజేపీలో పదవులు ● సంజయ్ అవకాశమివ్వడంటూ మల్కాజ్‌గిరి ఎంపీకి ఫిర్యాదులు ● ప్రతీ ఒక్కరిని గెలిపించుకుంటానని రాజేందర్ అభయం ● తమనేతపై యుద్ధం ప్రకటించాడంటున్న సంజయ్ అనుచరులు ● రాజేందర్ క్రమశిక్షణ ఉల్లంఘించారని ఆగ్రహం
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సొంత పార్టీ నేతలపై యుద్ధం ప్రకటించాడా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తో ప్రత్యక్ష వైరానికి దిగాడా? అంటే...? అవుననే అంటున్నారు బీజేపీ నేతలు. కరీంనగర్ జిల్లాలో నాలుగైదు రోజులుగా బండి వర్సెస్ ఈటల వర్గాల మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి శనివారం తెరపడింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు బండి సంజయ్ వర్గం అవకాశం ఇవ్వరంటూ ఈటల రాజేందర్ వర్గీయులు పలుమార్లు నియోజకవర్గంలో రహస్య సమావేశాలు నిర్వహించారు. శనివారం శామీర్‌పేటలో ఈటల రాజేందర్‌తో సమావేశమయ్యారు. అక్కడ ఎంపీ రాజేందర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలానికి దారితీశాయి. ఆయన ప్రసంగంలో ఎక్కడా బండి సంజయ్ పేరు ఉచ్ఛరించకున్నా.. ప్రత్యక్షంగానే హెచ్చరికలు చేసినట్లు స్పష్టమవుతుందని సంజయ్ వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఈ మాటలతో ఇంతకాలం అంతర్గతంగా కొనసాగుతున్న రాజేందర్– బండి వర్గాల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కినట్లయిందని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.
రాజేందర్ వ్యాఖ్యలపైనే చర్చ
రాజేందర్ ప్రసంగం ఆసాంతం ఆయన బీఆర్‌ఎస్‌లో మంత్రిగా ఉన్నప్పుడు బడుగులకు చేసిన సేవలు, తాను 2002లో రాజకీయాలకు వచ్చానని, ఉమ్మడి జిల్లాలో తాను అడుగుపెట్టని గ్రామం లేదని, వైఎస్ నుంచి కేసీఆర్ దాకా తాను ఎదిరించని సీఎం లేడని చెప్పుకొస్తూ సంజయ్ తనకన్నా జూనియర్ అని చెప్పకనే చెప్పారు. తన మౌనాన్ని బలహీనతగా భావించవద్దని, తుఫాను ముందు సముద్రం ప్రశాంతంగా ఉంటుందని, కానీ.. ప్రళ యం వస్తుంది కొడకా! అంటూ హెచ్చరించారు. అనుచరులు ఎవరూ అధైర్య పడొద్దని, అందరినీ గెలిపించుకుంటానని అభయమిచ్చారు. నాయకుడికి క్రెడిబిలిటీ లేకపోతే పార్టీ ఉండదని, అతనిలా తాను డ్రామా ఆర్టిస్టును కాదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తనకు ప్రజలమద్దతు ఉందని చెప్పుకొచ్చారు. ఎంపీ ఎన్నికల్లో తనకు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినన్ని ఓట్లు వేయించానని, తాను బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు బీజేపీకి అన్ని ఓట్లు రాలేదని గుర్తు చేశారు. సమావేశానికి హాజరైన 132 మంది బీజేపీ లీడర్లందరికీ పార్టీలో పదవులు ఉన్నాయని, ఎవరిని తక్కువ చేయలేదని, వారు పొందిన పదవుల జాబితాను సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.
ఈటలపై అధిష్టానానికి ఫిర్యాదు?
ఆర్‌ఎస్‌ఎస్ నుంచి పార్టీలో కొనసాగుతూ.. నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగిన సంజయ్‌పై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై ఆయనవర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. తమది రాజకీయ ప్రయోజనాల కోసం చేరే పార్టీ కాదని, క్రమశిక్షణకు కట్టుబడి ఉంటే పార్టీ అని గుర్తుచేస్తున్నారు. పార్టీని కాదని.. వ్యక్తులు తమను తాము అధికంగా భావిస్తే పార్టీ పక్కనబెడుతుందన్న విషయం మర్చిపోవద్దంటున్నారు. దేనికై నా ఓపిక ఉండాలని, పార్టీ ప్రయోజనాలకు తప్ప వ్యక్తిగత ఎజెండాలకు ఇక్కడ ప్రాధాన్యం ఉండదని స్పష్టం చేస్తున్నారు. పార్టీ విధానాలను ధిక్కరించిన యడ్యూరప్ప, జశ్వంత్‌సింగ్, రాజాసింగ్‌లను పక్కనబెట్టిన విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు. ఓపికగా ఉంటే పదవులు వరిస్తాయనేందుకు గవర్నర్లు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉదాహరణలన్న విషయాన్ని గుర్తుచేశారు. బీజేపీ ఎంపీలు ఎవరి నియోజకవర్గాలకు వారు పరిమితమవ్వాలి తప్ప, ఇతరుల నియోజకవర్గాల్లో గ్రూపులను ప్రోత్సహించడం, పార్టీకి సంబంధం లేకుండా గెలిపిస్తానని హామీలు ఇవ్వడంపై కమలనాథులు ఆశ్చర్యపోతున్నారు. పార్టీలో మొలకెత్తిన కొత్త పోకడను ఆదిలోనే అంతం చేయాలంటున్నారు. రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు ‘బండి’ వర్గంవారు సిద్ధం అవుతున్నారు.