
పేదల సంక్షేమానికి పెద్దపీట
● బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ కార్పొరేషన్/సైదాపూర్: ప్రజాపాలనలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభా కర్ తెలిపారు. సైదాపూర్‌లో శనివారం ఏర్పాటు చేసిన ప్రభుత్వ పథకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మండలంలో 1,301రేషన్ కార్డులు అందించి, 1,795 మందిని లబ్ధిదారులుగా చేర్చామని పేర్కొన్నారు. 585 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. మహిళలకు రూ.600 కోట్ల వడ్డీలేని రుణాల చెక్కులు అందజేశారు. కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. వనమహోత్సవంలో మొక్కలు నాటారు. కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ పాల్గొన్నారు.
చొక్కారావు శిష్యుడిగా గర్విస్తున్నా..
మాజీ మంత్రి జువ్వాడి చొక్కారావు శిష్యుడిగా తాను గర్విస్తున్నానని, నీతి నిజాయితీకి ఆయన మారుపేరని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చొక్కారావు జయంతి సందర్భంగా శనివారం నగరంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో చొక్కారావు చిరస్మరణీయులన్నారు. ఆయన దగ్గర తాను రాజకీయం నేర్చుకోవడం గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. 1957 ప్రాంతంలో చొక్కారావు రవాణా శాఖ మంత్రి అయితే, ఆయన శిష్యుడైన తాను ఇప్పుడు రవాణాశాఖ మంత్రిగా ఉన్నానన్నారు. రవాణా శాఖ మంత్రిగాబాధ్యతలు చేపట్టిన తరువాత ఎల్‌ఎండీలోని రవాణాశాఖ కార్యాలయంలో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్‌కు చొక్కారావు పేరు పెట్టడం జరిగిందన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, వైద్యుల అంజన్‌కుమార్, ఆకారపు భాస్కర్‌రెడ్డి, మల్లికార్జున రాజేందర్, గడ్డం విలాస్‌రెడ్డి పాల్గొన్నారు.
తాళం పగులగొట్టి లోనికి..
మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చే 20 నిమిషాల ముందు వరకు జంక్షన్ లోనికి వెళ్లే గేట్ తాళం తీయలేదు. దీంతో కాంగ్రెస్ నాయకులు తాళం పగలగొట్టి గేట్ తీశారు. అక్కడికి చేరుకున్న నగర పాలక సంస్థ అధికారులు తమకు సమాచారం ఇస్తే తాళం తీసేవాళ్లమన్నారు. ఆ సమాచారం ఎవరు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నాయకులు మల్లగుల్లాలు పడటం గమనార్హం.