
కోకొల్లలు!
క్రిప్టో పాపాలు
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●:
కరీంనగర్ కేంద్రంగా వెలుగుచూసిన మెటా క్రిప్టో దందా రోజుకో మలుపు తిరుగుతోంది. వాస్తవానికి ఇందులో జరుగుతున్న మోసాలపై బాధితులు నగరంలోని పలు ఠాణాల్లో ఇప్పటికే ఫిర్యాదులు చేసినా.. పోలీసులు పట్టించుకోకపోవడంతో పాపాల పుట్ట ఆలస్యంగా బద్దలవుతోంది. తొండ ముదిరి ఊసరవెల్లిగా మారినట్లు.. మెటా ఫండ్ పేరుతో మొదలైన క్రిప్టో దందా.. రెండు నెలలకే మెటా ప్రో అని పేరు మార్చుకుంది. అదేంటంటే సాంకేతిక మార్పులు అని సర్ది చెప్పారు. ఇక మొత్తం వ్యవహారంలో నగరంలోని ఓ టింబర్ డిపో యజమాని, ఓ మొబైల్ షాప్ ఓనర్, ఓ మాజీ కార్పొరేటర్ ముగ్గురు అమాయక ప్రజల నుంచి రూ.కోట్లు వసూలు చేశారు. ఇక ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి లోకేశ్ ఏపీకి చెందినవాడని కొందరు, ఆయన పూర్వీకులు సిద్దిపేటకు చెందినవారని మరికొందరు బాధితులు చెబుతున్నారు. వీరంతా పథకం ప్రకారం అమాయక ప్రజలకు డబ్బులు రెట్టింపు అవుతాయని ఆశ చూపించి.. వారి నుంచి రూ.కోట్లు వసూలు చేసి ఇపుడు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.