జోష్‌ నింపేందుకు.. | Sakshi
Sakshi News home page

జోష్‌ నింపేందుకు..

Published Fri, Nov 17 2023 1:20 AM

జమ్మికుంటలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ శుక్రవారం కరీంనగర్‌ జిల్లాకు రానున్నారు. కరీంనగర్‌, చొప్పదండి, హుజూరాబాద్‌ నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని, బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపనున్నారు.

ఏర్పాట్ల పరిశీలన..

ప్రజా ఆశీర్వాద సభల ఏర్పాట్లను కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ వై.సునీల్‌రావులు గురువారం పరిశీలించారు. పత్తికుంటపల్లిలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, జమ్మికుంటలో ఏర్పాట్లను ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి పరిశీలించారు. పార్కింగ్‌ తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు.

భారీ జన సమీకరణకు కసరత్తు

ఎన్నికల ప్రచారానికి మరో 11 రోజులే గడువు ఉంది. ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, ర్యా లీలు, ఇంటింటా ప్రచారంతో హోరెత్తిస్తున్నా యి. బీఆర్‌ఎస్‌ నియోజకవర్గాల వారీగా ప్రజా ఆశీర్వాద సభలకు శ్రీకారం చుట్టింది. నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే పార్టీ అధినేత బహిరంగ సభలకు భారీ జన సమీకరణ చేస్తున్నారు.

విమర్శల డోసు పెంచుతారన్న భావన

ఉమ్మడి జిల్లా గులాబీ కేడర్‌లో జోష్‌ నింపేందుకు సీఎం వరుస పర్యటనలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన పనులు వివరిస్తూ.. ప్రతిపక్షాలపై నిప్పులు చెరుగుతున్నారు. గత నెల 15న హుస్నాబాద్‌, 17న సిరిసిల్ల, ఈ నెల 2న ధర్మపురి, 3న కోరుట్ల, 7న మంథని, పెద్దపల్లిల్లో సభలు నిర్వహించారు. రెండో విడతలో కరీంనగర్‌ జిల్లాను చుట్టేందుకు వస్తున్నారు. చి వరగా ఈ నెల 20న మానకొండూరులో, 24న రామగుండం, 26న వేములవాడ, జగిత్యాలల్లో పర్యటించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న దరి మిలా.. సభల్లో ఆయన విపక్షాలపై విమర్శల డోసు పెంచుతారని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. అవి తమ కేడర్‌కు ఉత్సాహాన్నిస్తాయని ఎమ్మెల్యే అభ్యర్థులు ధీమాగా ఉన్నారు.

డ్రోన్లు నిషేధం, సీఎం వద్దకు ఎవరూ రావొద్దు

సీఎం కేసీఆర్‌ శుక్రవారం వరుసగా మూడు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్న నేపథ్యంలో ఆయన భద్రత విషయంలో ఇంటలిజెన్స్‌ విభాగం సీపీకి పలు కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా సభలు జరిగే ప్రాంతాల్లో 3 కి.మీ. నుంచి 5 కి.మీ. వరకు డ్రోన్లు ఎగరడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సీఎం హెలీప్యాడ్‌, సభా ప్రాంగణం పరిసరాల్లోకి ఎలాంటి యూఏవీ (అన్‌మ్యాన్డ్‌ ఏయిర్‌ వెహికిల్స్‌)ను అనుమతించవద్దని హెచ్చరించింది. కరీంనగర్‌ జిల్లా వామపక్ష, తీవ్రవాద ప్రభావిత జిల్లా కావడం, ఇక్కడ పాకిస్తాన్‌ ప్రేరేపిత ఐఎస్‌ఐ భావజాలం కలిగిన వ్యక్తుల కారణంగా ఆయన భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. రక్షణ చర్యల్లో భాగంగా జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ కల్పించాలని, ముఖ్యమంత్రికి భద్రతా వలయంగా సుశిక్షితులైన రిజర్వ్‌/టీఎస్‌ఎస్‌పీ పోలీసులను ఏకే–47 తుపాకులతో మోహరించాలని చెప్పింది. అలాగే, ఇటీవల బీఆర్‌ఎస్‌ నేతలపై వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ సమీపంలోకి అభిమానులను ఎవరినీ రానివ్వొద్దని పేర్కొంది. సీఎం బ్లడ్‌ గ్రూపు ఏ–పాజిటివ్‌ రక్తాన్ని ముందు జాగ్రత్తగా అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.

సీఎం కేసీఆర్‌ పర్యటన ఇలా..

మధ్యాహ్నం ఒంటి గంట : హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ నుంచి బయలుదేరుతారు.

మధ్యాహ్నం 1.35 గంటలకు : కరీంనగర్‌ ఎస్సారార్‌ కళాశాల మైదానంలోని సభలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 2.35 గంటలకు : చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలోని పత్తికుంటపల్లిలో జరిగే సభకు హాజరవుతారు.

మధ్యాహ్నం 3.50 గంటలకు : హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే సభలో పాల్గొంటారు.

సాయంత్రం 4.50 గంటలకు : జమ్మికుంట నుంచి హనుమకొండ జిల్లాకు వెళ్లనున్నారు.

నేడు జిల్లాకు సీఎం కేసీఆర్‌

కరీంనగర్‌, గంగాధర, జమ్మికుంటలో ప్రజాఆశీర్వాద సభలు

జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ కల్పించాలన్న ఇంటలిజెన్స్‌ విభాగం

కరీంనగర్‌లో ఏర్పాట్లు పరిశీలిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌
1/2

కరీంనగర్‌లో ఏర్పాట్లు పరిశీలిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌

2/2

 
Advertisement
 
Advertisement