నామినేషన్‌ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించండి | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించండి

Published Sat, Nov 11 2023 12:50 AM

- - Sakshi

● జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి

కరీంనగర్‌ అర్బన్‌/మానకొండూర్‌: శాసనసభ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి ఆదేశించారు. శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ముగియగా కరీంనగర్‌, మానకొండూర్‌ రిటర్నింగ్‌ ఆధికారి కార్యాలయాలను పరిశీలించారు. నామినేషన్‌ వివరాలు, వాటితో దాఖలు చేసిన పత్రాల వివరాలను గురించి ఆర్వోలు కుందారపు మహేశ్వర్‌, లక్ష్మీకిరణ్‌ను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్‌లను పరిశీలించి నిర్వర్తించాల్సి న పనులను ఎప్పటికప్పుడే పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు.

అప్రమత్తంగా ఉండాలి

సీపీ అభిషేక్‌ మహంతి

గంగాధర/రామడుగు/కరీంనగర్‌క్రైం: ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సీపీ అభిషేక్‌ మహంతి సూచించారు. శుక్రవారం రామడుగు, గంగాధర పోలీస్‌స్టేషన్లను సీపీ ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. నేరస్తులు, రౌడీషీటర్లు, రెండు మండలాల్లోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ఎన్నికల సమయంలో గొడవలు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి, ఓటర్లను ప్రభావితం చేసిన వ్యక్తులపై నిఘా పెంచాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని బైండోవర్‌ చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల నియమావళిని పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు. సీపీ వెంట చొప్పదండి సీఐ గోపతి రవీందర్‌, ఎస్సైలు అభిలాష్‌, తోట తిరుపతి ఉన్నారు.

చెక్‌పోస్ట్‌ తనిఖీ

చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని వెలి చాల క్రాస్‌రోడ్‌ వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్ట్‌ను శుక్రవారం సీపీ అభిషేక్‌ మహంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. వాహన తనిఖీల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. అలసత్వం ప్రదర్శిస్తే శాఖపరమైన చర్యలు తప్పవన్నారు. అక్రమ తరలింపులను గుర్తించినట్లయితే వాటిని సీజ్‌ చేసే సమయంలో వీడియోగ్రఫీ చేయించాలన్నారు.

1/1

Advertisement
 

తప్పక చదవండి

Advertisement