పోటీయేలేని ‘పంచాయతీ’
ఈసారి కూడా ఏకగ్రీవమే..
స్థానిక ఎన్నికల్లో సిరాచుక్కా పడదు..
జిల్లా నలుమూలల్లో ఏ గ్రామంలో చూసినా సర్పంచ్ పదవికి కనీసం ఇద్దరి నుంచి 10 మంది వరకు నామినేషన్లు వేసి పోటీ పడుతున్నారు. అయితే ఆ గ్రామంలో మాత్రం సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో సైతం ఏకగ్రీవానికే గ్రామస్తులంతా మొగ్గు చూపుతున్నారు.
బాన్సువాడ రూరల్ : పోచారం.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి. ఇంటిపేరు పరిగె అయినా ఊరి పేరే ఇంటిపేరుగా మార్చుకొని రాష్ట్ర ప్రజలకు సుపరిచితులైన శ్రీనివాస్‌రెడ్డి సొంతూరు పోచారం. ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. గ్రామ పంచాయతీగా ఏర్పడినప్పటి నుంచి పోటీలేని గ్రామ పంచాయతీగా పోచారం కొనసాగుతోంది.
సమష్టి నిర్ణయాలు..
గ్రామంలో పండుగలు, ఎన్నికలు, చిన్న, పెద్ద తగాదాలను గ్రామస్తులంతా కూర్చొని సమష్టి నిర్ణయా లు తీసుకుంటారు. సుమారు 900పైగా జనాభా, 712 మంది ఓటర్లు ఉన్నా ఈ చిన్న గ్రామంలో అన్ని కులాలు, మతాలవారు కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులుగా ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు జరిగే ఎన్నికల్లో తప్ప ఎప్పుడూ తమ చేతివేలిపై పంచాయతీ ఎన్నికల సిరాచుక్కా పడలేదని గ్రామస్తులు గర్వంగా చెబుతున్నారు.
1984లో పంచాయతీగా ఏర్పాటు
పోచారంతోపాటు రాంపూర్ గ్రామాలు ఇ బ్రాహింపేట్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేవి. 1984లో పోచారం, రాంపూర్ ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. 1984 లో తొలిసారి ఈ గ్రామ పంచాయతీకి ఎన్నికలు వచ్చాయి. అప్పటినుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోచారంలో పోటీనే లేదు.
మొదటి సర్పంచ్‌గా బూదయ్య..
1984లో ఎన్నికల్లో మొదటి సర్పంచ్‌గా బూదయ్య (ఎస్సీ రిజర్వుడు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి సర్పంచులతో పాటు, వార్డు సభ్యులు అందరూ ఏకగ్రీవంగానే ఎన్నికవుతూ వస్తున్నా రు. ఈసారి సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. ఎప్పటిలాగే ఆనవాయితీ కొనసాగిస్తూ పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగానే ఎన్ను కుంటామని గ్రామస్తులు చెబుతున్నారు.
మిగతా గ్రామాలతో పోలిస్తే మా పోచారం గ్రామంలో ఎన్నికల వాతావరణం లేదు. ప్రతిసారి మాదిరిగానే ఈసారి సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి గ్రామస్తులు సన్నద్ధంగా ఉన్నారు. మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న పోచారం, ఆయన కుటుంబసభ్యుల ఆదేశానుసారం కులసంఘాలతో సమావేశమై నిర్ణయం
తీసుకుంటాం. – లతీఫ్, గ్రామస్తుడు
స్థానిక ఎన్నికలు వస్తే మా వేలిపై సిరాచుక్క పడదు. ఈసారి ఎస్టీ రిజర్వుడు ఉంది. మా గ్రామపంచాయతీ పరిధిలోని పోచారం తండా నుంచి నలుగురు ఆసక్తి చూపుతున్నారు. వారిలో ఒకరిని సర్పంచ్ చేస్తాం. ఏకగ్రీవంగా ఎన్నికైన కార్యవర్గానికి గ్రామస్తులందరం సంపూర్ణ సహకారం అందిస్తాం.
– నరేశ్ గౌడ్, గ్రామస్తుడు
నాలుగు దశాబ్దాలుగా ఏకగ్రీవాలే..
బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి స్వగ్రామం ‘పోచారం’ ఘనత
ఈసారీ ఆనవాయితీ
కొనసాగిస్తామంటున్న గ్రామస్తులు
పోటీయేలేని ‘పంచాయతీ’
పోటీయేలేని ‘పంచాయతీ’


