సర్కారు స్థలానికి విముక్తి!
● కబ్జాలను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’
● జిల్లాకేంద్రంలో అక్రమ నిర్మాణాలను తొలగించిన టాస్క్‌ఫోర్స్ బృందం
● స్థలం స్వాధీనం చేసుకున్న బల్దియా
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని సర్కారు స్థలంలో కబ్జాలపై టాస్క్‌ఫోర్స్ బృందం అధికారులు కొరడా ఝుళిపించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య పొక్లెయిన్‌లతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. సోమవారం తెల్లవారుజామునే టాస్క్‌ఫోర్స్ బృందం అధికారులు స్థలం వద్దకు చేరుకుని స్వాధీనం చేసుకునే చర్యలు ప్రారంభించారు.
జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్ రోడ్‌లో సర్వేనంబర్ 6లో గల ప్రభుత్వ స్థలం చాలా ఏళ్ల క్రితమే ఆక్రమణకు గురయ్యింది. కొందరు అక్రమ రిజిస్ట్రేషన్ పత్రాలను సృష్టించి స్థలాన్ని ఆక్రమించారు. ఇది సర్కారు స్థలమని, స్వాధీనం చేసుకుని ప్రభుత్వ సంస్థలను నెలకొల్పాలని ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నాలుగేళ్ల క్రితమే ఆధారాలతో పోరాటం చేపట్టారు. దీంతో పలుమార్లు రెవెన్యూ శాఖ సర్వే చేసి సర్వే నంబర్ 6లోని ఎకరం 32 గుంటలను ప్రభుత్వ భూమిగా నిర్ధారించింది. అప్రమత్తమైన కబ్జాదారులు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. బల్దియా, రెవెన్యూ శాఖల అధికారులు కోర్టుకు ఆధారాలతో కౌంటర్ దాఖలు చేయడంతో అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలో స్థలం ఖాళీ చేయాలని 26 మందికి 15 రోజుల క్రితమే తుది నోటీసులను అందజేశారు. వారు స్పందించకపోవడంతో సోమవారం ఉదయం 5 గంటలకు మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, అగ్నిమాపక శాఖలతో కూడిన టాస్క్‌ఫోర్స్ బృందం స్థలం వద్దకు చేరుకుంది. మూడు పొక్లెయిన్‌లు, డోజర్, ట్రాక్టర్‌ల సహాయంతో ఆ స్థలంలో ఏర్పాటు చేసుకున్న కల్లు దుకాణంలో కొంతభాగం, ఇసుక వ్యాపారుల రేకుల షెడ్లు, ఇతర చిరు వ్యాపారుల షెడ్లను కూల్చివేశారు.
వాగ్వాదం.. హెచ్చరిక..
చాలా ఏళ్ల నుంచి ఈ స్థలంలో కబ్జాలో ఉన్నామని, కోర్టుకు వెళ్తామని ఇసుక వ్యాపారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈనెల 12వ తేదీ వరకు కోర్టు స్టే ఉందని అడ్వకేట్ బాలకిషన్ మున్సిపల్ కమిషనర్‌తో వాదించారు. మున్సిపల్, రెవెన్యూ శాఖలకు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు అందజేస్తామన్నారు. సర్కారు స్థలాలను కబ్జా చేస్తే కఠిన చర్యలుంటాయని కమిషనర్ హెచ్చరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆక్రమణల తొలగింపు, స్వాధీనం పనులు కొనసాగాయి. ఈ స్థలంలో చాలా ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న 8 కుటుంబాలకు సైతం రెండు రోజుల్లో ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. కోర్టు స్టే ఉన్న రెండు భవనాలకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలుంటాయని టీపీవో తెలిపారు. చదును చేసిన స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ దాడుల్లో ఆర్డీవో వీణ, తహసీల్దార్ జనార్దన్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, టీపీవో గిరిధర్, టీపీఎస్ దివ్య, పట్టణ సీఐ నరహరి, ఆర్‌ఐ నర్సింహారెడ్డి, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ముందే చెప్పిన ‘సాక్షి’..
పట్టణంలోని సర్వే నంబర్ 6లోగల ప్రభుత్వ స్థ లం ఆక్రమణకు గురయ్యిందన్న విషయమై ‘సాక్షి’ దినపత్రిక రెండేళ్లలో పలుమార్లు కథనా లు ప్రచురించింది. అంతేకాక ఈ స్థలాన్ని బల్ది యా స్వాధీనం చేసుకుంటుందని గతనెలలో నూ ఓ కథనంలో చెప్పింది. సాక్షి చెప్పినట్లుగా నే అధికారులు చర్యలు చేపట్టి సర్కారు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థలంలో ఆయుష్ ఆస్పత్రి, లేక ఈఎస్‌ఐ ఆస్పత్రి లేదా కూరగా యల మార్కెట్ ఏర్పాటు చేయాలని ప్రజలు కో రుతున్నారు. బల్దియ ఆదాయం కోసం త్వరలో ఈ స్థలంలో వ్యాపార సముదాయం నిర్మిస్తామ ని అధికారులు చెబుతున్నారు.
సర్కారు స్థలానికి విముక్తి!


