రెండో రోజు నామినేషన్ల జోరు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పంచాయతీ ఎన్నికల్లో రెండో విడతకు సంబంధించి నామినేషన్ల ఘట్టం కొనసాగుతోంది. తొలిరోజు ఆదివారం నామమాత్రంగానే నామినేషన్లు వచ్చాయి. రెండో రోజు సోమవారం భారీగా నమోదయ్యాయి. 197 గ్రామాల్లో సర్పంచ్ పదవులతో పాటు 1,654 వార్డులకు రెండో విడతలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం సర్పంచ్ స్థానాలకు 353, వార్డులకు 774 నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం చివరి రోజు కావడంతో భారీగా నామపత్రాలు సమర్పించే అవకాశాలున్నాయి.
మూడో విడతకు సంబంధించిన నామినేషన్ల పర్వం ఈనెల 3న మొదలుకానుంది. అలాగే తొలి విడతలో నామినేషన్లు దాఖలు చేసిన వారు పోటీ నుంచి తప్పుకునేందుకు ఈనెల 3 వరకు అవకాశం ఉంది. దీంతో ఏకగ్రీవాలు చేసుకోవడానికి పోటీలో నిలిచిన వారిని సముదాయిస్తున్నారు. ప్రధాన పార్టీల నేతలు పల్లె ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో మకాం వేసి పావులు కదుపుతున్నారు. పోటీలో ఉన్నవారిని బుజ్జగించి తమ పార్టీ మద్దతుదారులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
సర్పంచ్ స్థానాలకు 353,
వార్డులకు 774..
రెండో విడతకు నేటితో
ముగియనున్న గడువు


