ఇంకెన్నాళ్లు వేచి చూడాలి?
● ఉప్పల్‌వాయి రైల్వే గేట్‌తో ఇబ్బందులు
● రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్‌వోబీ)
నిర్మించాలని డిమాండ్
రామారెడ్డి (ఎల్లారెడ్డి): ఉప్పల్‌వాయి రైల్వే గేట్ వద్ద ప్రయాణికులు చాలా ఏళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. రైలు వచ్చినప్పుడు గేట్ పడటం.. పది నుంచి 30 నిమిషాల పాటు వచ్చిపోయేవారు వేచి ఉండడం చాలా ఏళ్ల నుంచి సర్వసాధారణమైపోయింది. రోజుకు సుమారుగా 50 నుంచి 55 వరకు రైళ్లు ఉప్పల్‌వాయి రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తుంటాయి. గేటు వేసిన ప్రతిసారి ఈ రోడ్డు మార్గంలో ప్రయాణించేవారు తక్కువలో తక్కువగా అరగంట వరకు వేచి ఉండాల్సిందే. మధ్య మధ్యలో ట్రాక్ రిపేర్ల కారణంగా మూడు రోజులు నాలుగు రోజులు పాటు పూర్తిగా గేట్ బంద్ చేస్తారు. దీంతో తిర్మన్‌పల్లి, మర్కల్, సదాశివనగర్‌కు ఎన్‌హెచ్ –44కు కలిపే రోడ్డుకు వెళ్లేవారు కామారెడ్డి మీదుగా వెళుతుంటారు. ఇలా వెళ్లడం వల్ల 20 నుంచి 25 కిలోమీటర్లు అదనపు దూరం అవుతుంది.
ఎన్‌హెచ్–44 కలిపే రోడ్డు..
రామారెడ్డి నుంచి ఉప్పల్‌వాయి మీదుగా సదాశివనగర్ ఎన్‌హెచ్–44 రోడ్డును కలిపే మార్గం ఉప్పల్‌వాయి రైల్వే ట్రాక్‌పై నుంచి వెళ్లడంతో ఇటు మాచారెడ్డి సిరిసిల్ల వైపు నుంచి వచ్చేవారు భీంగల్ వైపు నుంచి వచ్చేవారు ట్రాక్ బంద్ ఉన్నప్పుడు, గేట్ పడ్డప్పుడు ఆలస్యం అవుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్పందించి ఎంపీ సురేష్ షెట్కార్‌తో మాట్లాడి రైల్వే బ్రిడ్జిని నిర్మించాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.


