ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
● ప్రజావాణికి 101 ఫిర్యాదులు
నిజామాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 101 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, డీపీవో శ్రీనివాస్, హౌసింగ్ పీడీ పవన్‌కుమార్‌కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మహిళా, శిశు, వయో వృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన గోడప్రతులను కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్ బీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


