ముందస్తు సాగుకు సమాయత్తం
● నిండుకుండల్లా జలాశయాలు
● ఆయకట్టుకు ‘సాగర్’ భరోసా
నిజాంసాగర్(జుక్కల్) : యాసంగి సీజన్‌లో ముందస్తు పంటల సాగుకు రైతన్నలు సమాయత్తం అవుతున్నారు. వ్యవసాయబోరుబావుల కింద నారుమళ్లు సిద్ధం చేస్తుండగా చెరువులు, కుంటలు, ప్రధాన కాలువల కింద భూములను దుక్కి చేయిస్తున్నారు. పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు దుకాణాల్లో నిల్వ ఉండటంతో విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టంతో నిండుకుండల్లా ఉన్నాయి. జిల్లాలో 1,515 చెరువులు, కుంటలు ఉండగా.. లక్ష ఎకరాల ఆయకట్టు ఉంది. నెలన్నర రోజుల కిందటి వరకు వర్షాలు విస్తారంగా కురవడంతో ప్రధాన చెరువులతోపాటు కుంటలు యాసంగి పంటల సాగుకు భరోసానిస్తున్నాయి.
సాగర్ ఆయకట్టు 1.25 లక్షల ఎకరాలు
నిజాంసాగర్ ప్రాజెక్టు కింద ప్రధాన కాలువ ఆయకట్టు పరిధిలో 1.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నారు. ఇప్పటికే వర్ని, కోటగిరి, బో ధన్, బీర్కూర్, నసుల్లాబాద్, బాన్సువాడ మండ లాల్లో రైతులు బోరుబావుల కింద నారుమళ్లు సిద్ధం చేశారు. మహ్మద్‌నగర్, నిజాంసాగర్ మండలాల్లోని మొదటి ఆయకట్టు ప్రాంత రైతులు నారుమళ్లు వే యడం కొంత ఆలస్యమవుతుంది. మొదటి ఆయక ట్టు ప్రాంత రైతాంగానికి ప్రధాన కాలువ ఆధారంగా ఉంది. వానాకాలం సీజన్‌లో నారుమళ్లు, వరినా ట్లు వేయడంలో ఆలస్యం కావడంతో పంట నూర్పి డి పనులు వెనుకబడ్డాయి. అయితే ప్రధాన కాలువకు నీటి విడుదల చేపట్టకపోవడంతో నారుమళ్లు వేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది.
వచ్చే నెలలో నీటి విడుదలకు అవకాశం
యాసంగి పంటల పంటల సాగు అవసరాల కోసం వచ్చే నెలలో నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదల చేపట్టనున్నారు. యాసంగి పంటలకు సాగుకు సంబంధించి నీటిపారుదలశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అయితే వచ్చే నెల మొదటి వారంలో శివ్వం కమిటీ సమావేశం ఏర్పాటు కానుంది. శివ్వం కమిటీ సమావేశం తీర్మనం ఆమోదం మేరకు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేయనున్నారు.
నిజాంసాగర్ ఆయకట్ట కింద 1.25 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు గాను ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీరందిస్తాం. శివ్వం కమిటీ సమావేశం తీర్మానం మేరకు 7 విడతల్లో 12 టీఎంసీల నీటి విడుదల చేపట్టనున్నాం.
– శ్రీనివాస్, సీఈ, కామారెడ్డి
ముందస్తు సాగుకు సమాయత్తం


