భర్తకు తలకొరివి పెట్టిన భార్య
లింగంపేట: గుండెపోటుతో మృతి చెందిన భర్తకు భార్య తలకొరివి పెట్టిన ఘటన లింగంపేట మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. లింగంపేట మండల కేంద్రానికి చెందిన బందరు బాలయ్య(65) ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. ఉన్న ఒక్క కొడుకు జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లి గతంలో ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. నాటి నుంచి వీరు ఇద్దరే ఉంటున్నారు. భర్తకు భార్య సత్తెవ్వ తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు చేసిన సంఘటన స్థానికులను కలిచివేసింది.
లింగంపేట: మండలంలోని కోమట్‌పల్లి చౌరస్తాలో అనుమతి లేకుండా మద్యం సిట్టింగ్ నిర్వహిస్తున్న ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలిపారు. సరిచంద్ అనే వ్యక్తి కొంత కాలంగా బెల్ట్‌షాప్, మద్యం సిట్టింగ్ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆదివారం దాడి చేసి సిట్టింగ్ నిర్వహిస్తున్న సరిచంద్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనుమతి లేకుండా మద్యం సిట్టింగులు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు.
● రైతు ఖాతా నుంచి రూ. 96 వేలు మాయం
బాన్సువాడ: బీర్కూర్ మండలం చించొలి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ ఖాతా నుంచి రూ. 96 వేలు సైబర్ మోసం జరిగింది. రైతు శ్రీనివాస్ ధాన్యం విక్రయించడంతో ఈ నెల 13న అతడి బ్యాంకు ఖాతాలో రూ. 1.04 లక్షలు జమ అయ్యాయి. వెంటనే శ్రీనివాస్ ఫోన్‌కు తన ఆధార్ నంబర్ అప్‌డేట్ చేసుకోవాలని మెసేజ్ వచ్చింది. ఈ నెల 14న శ్రీనివాస్ ఫోన్‌కు ఓ లింక్ రావడంతో శ్రీనివాస్ దానిని ఓపెన్ చేయగా గంట వ్యవధిలో రూ.96 వేలు సైబర్ ఖాతాలోకి వెళ్లాయి. శ్రీనివాస్ వెంటనే బీర్కూర్ బ్యాంకుకు వెళ్లి ఆరా తీశాడు. రెండు సార్లు రూ.96 వేలు డ్రా అయినట్లు బ్యాంకు సిబ్బంది చెప్పడంతో వెంటనే పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు.


