వ్యాపారాల్లో మహిళల రాణింపు
దోమకొండ: ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా మహిళలు వ్యాపారాల్లో రాణిస్తున్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలను తీసుకుని ఇప్పటికే పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న మహిళలు రైతులకు సైతం అండగా నిలుస్తున్నారు. జిల్లాలో మొత్తం 427 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, వాటిలో 195 కొనుగోలు కేంద్రాలను ఐకేపీ ఆధ్వర్యంలో మహిళలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 22 మండలాల్లో 17,118 డ్వాక్రా మహిళా సంఘాలు ఉన్నాయి. గత ఏడాది మహిళా సంఘాల ద్వారా 10లక్షల 49వేల క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. ఈ ఏడాది దాదాపు 15 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలోని డ్వాక్రా సంఘాల్లో సభ్యులైన మహిళలకు పలు ఉపాధి అవకాశాల కొసం అధికారులు ఇందిరా మహిళా శక్తి పథకంలో 11,569 యూనిట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. వాటిలో ఇప్పటి వరకు 9879 యూనిట్లు ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారు. పలు రకాల వ్యాపారాల్లో మహిళలు రాణిస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మహిళా సంఘాల సభ్యులకు వ్యవసాయశాఖ ద్వారా శిక్షణ ఇచ్చారు. మహిళలు ధాన్యాన్ని సేకరించడంతో పాటు రైతులకు వారి ఖాతాల్లో డబ్బులు త్వరగా పడేవిధంగా ఆన్‌లైన్ ట్యాబ్ ఎంట్రీ సైతం చేస్తున్నారు. జిల్లా పరిస్థితులకు తగ్గట్టుగా రైతులు కొనుగోలు చేసేవి, దిగుబడులు, నాణ్యతలను తెలుసుకునేందుకు వ్యవసాయశాఖ ద్వారా వీరు శిక్షణ పొందారు. వ్యాపారంలో మెలకువలు నేర్చుకున్నారు.
జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో
195 కొనుగోలు కేంద్రాలు
15 లక్షల క్వింటాళ్ల
ధాన్యం సేకరణ లక్ష్యంగా ముందుకు..


