గుర్తుతెలియని మహిళ దారుణ హత్య
● తల నరికి, చేతి వేళ్లు కోసి
ఘాతుకానికి పాల్పడ్డ దుండగులు
● మిట్టాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకున్న ఘటన
నవీపేట: మండలంలోని మిట్టాపూర్ శివారులో గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. దుండగులు సదరు మహిళను వివస్త్రను చేసి, తల నరికి, చేతి వేళ్లను కోసి, హతమార్చినట్లుగా ఉంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. మిట్టాపూర్ శివారులోకి శనివారం వేకువజామున గ్రామస్తులు వెళ్లగా, తల లేని మహిళ మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మహిళ దారుణ హత్యకు గురైనట్లు ఆనవాళ్లు కనిపించడంతో ఎస్సై తిరుపతి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే సీపీ సాయిచైతన్య, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. తల నరికి, కుడిచేతి మణికట్టుతోపాటు ఎడమచేయి వేళ్లు సగానికి కోసినట్లు ఉన్నాయి. దీంతో హత్యగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మొండెం మాత్రమే ఉండటంతో వేరే చోట హత్య చేసి ఇక్కడ పడేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహంపై వస్త్రాలు లేకపోవడంతో దుండగులు అత్యాచారం చేసి, హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. మహిళ వయస్సు సుమారు 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లతో పాటు 10 దర్యాప్తు బృందాలను రంగంలోకి దించినట్లు నార్త్‌రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. హత్యకు గురైన మహిళ ఆచూకీ లభ్యం కాగానే నిందితులను పట్టుకుంటామన్నారు.
వారం వ్యవధిలో రెండో ఘటన..
నవీపేట మండలంలో వారం వ్యవధిలో ఇద్దరి మహిళల దారుణ హత్యలు కలకలం రేపుతున్నాయి. గత నెల 24న మద్దెపల్లి గ్రామానికి చెందిన శ్యామల లక్ష్మి(45) అనే మహిళను గుర్తు తెలియని దుండగులు వివస్త్రను చేసి, నాగేపూర్ శివారులో దారుణంగా హత్య చేశారు. మృతురాలి సోదరి పోసాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అసలు నిందితులు దొరకలేదు. ఆ కేసు కొలిక్కిరాక ముందే మిట్టాపూర్ శివారులో మరో ఘటన చోటుచేసుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. రెండు హత్యలకు కొన్ని పోలికలు ఉండడంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ఆరంభించారు. సీపీ సాయి చైతన్య ఈ కేసులను సవాలుగా తీసుకుని నేరుగా విచారణకు దిగారు.


