విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
● మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
● సీపీ సాయిచైతన్య
ఆర్మూర్ టౌన్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఉన్నత జీవితాన్ని నిర్మించుకోవాలని సూచించారు. పట్టణంలోని బాలుర పాఠశాల మైదానంలో శనివారం పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నుంచి దూరంగా స్పోర్ట్స్‌కు దగ్గర కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మండలస్థాయి బాల బాలికలకు వాలీబాల్, కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులు మార్చ్‌ఫాస్ట్ ద్వారా సీపీకి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఫోన్లలో అనుమానిత లింకులను ఓపెన్ చేయొద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించేవిధంగా తల్లిదండ్రులకు సూచించాలన్నారు. ఎక్కడైన అవాంచనీయ ఘటనలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం క్రీడాకారులకు క్రీడాదుస్తులను అందజేశారు. విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, జిల్లా స్పోర్ట్స్, యూత్ అధికారి పవన్‌కుమార్, క్రీడాపోటీల కన్వీనర్ లక్ష్మీనర్సయ్య, ఎంఈవోలు రాజ గంగారాం, నరేంధర్, సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


