మోడల్ సోలార్ గ్రామంగా భిక్కనూరు
కామారెడ్డి క్రైం: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద మోడల్ సోలార్ గ్రామంగా భిక్కనూరు మండల కేంద్రం ఎంపికై ందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఒక మోడల్ సోలార్ గ్రామాన్ని స్థాపించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ గ్రామాన్ని ఎంపిక చేయడం కోసం జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసి ముందుగా 18 అర్హతగల గ్రామాలను గుర్తించారు. మార్గదర్శకాల ప్రకారం ఒక గ్రామం ఎంపికకు అర్హత పొందాలంటే తాజా జనాభా లెక్కల ప్రకారం 5 వేలకు మించిన జనాభా ఉండాలి. ఈ పథకంతో అన్ని రకాల ప్రభుత్వ భవనాలకు ఉచితంగా సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. సోలార్ గ్రామ మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు చేపట్టడానికి వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. జిల్లా స్థాయి కమిటీ క్రమం తప్పకుండా ప్లాంట్‌ల ఏర్పాటు పనులను నిరంతరంగా పర్యవేక్షించాలని సూచించారు.


