‘నిజాంసాగర్‌’ మరో రికార్డ్‌! | - | Sakshi
Sakshi News home page

‘నిజాంసాగర్‌’ మరో రికార్డ్‌!

Nov 2 2025 9:16 AM | Updated on Nov 2 2025 9:16 AM

‘నిజా

‘నిజాంసాగర్‌’ మరో రికార్డ్‌!

కొనసాగుతున్న నీటి విడుదల

ఈ ఏడాది మూడు వందల

టీఎంసీల ఇన్‌ఫ్లో

కొనసాగుతున్న వరద

నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం

నిజాంసాగర్‌: వందేళ్ల చరిత్ర కలిగిన నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరదలు వచ్చాయి. ఈ సీజన్‌లో ఇప్పటికే మూడు వందల టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఎగువన వర్షాలు కురుస్తుండడంతో ఇంకా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.

ప్రపంచంలో మొట్టమొదటి భారీ నీటిపారుదల ప్రాజెక్టుగా చరిత్రకెక్కిన నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని 1923లో ప్రారంభించారు. అచ్చంపేట వద్ద మంజీర నదిపై చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం 1931లో పూర్తయ్యింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వరప్రదాయినిగా ప్రసిద్ధికెక్కింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో లక్షా పాతికవేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతోంది.

రెండున్నర నెలల్లోనే..

ఈ యేడాది ముందస్తుగానే వర్షాలు కురిసినా తర్వాత వెనుకంజ వేశాయి. తిరిగి ఆగస్టు రెండోవారంలో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఎగువన కురిసిన వానలతో ఆగస్టు 18 నుంచి నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో మొదలయ్యింది. ఆగస్టు 27 నుంచి కర్ణాటక, మహారాష్ట్రాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వానలకు నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఒక్కసారిగా ఇన్‌ఫ్లో పెరిగింది. ఆ నెలలో 111 టీఎంసీల నీరు వచ్చి చేరింది. సెప్టెంబర్‌లోనూ భారీ వర్షాలు కురియడంతో మరో 126 టీఎంసీల ఇన్‌ఫ్లో వచ్చింది. అక్టోబర్‌లోనూ వరుణుడు జోరు చూపించడంతో 63 టీఎంసీల నీరు చేరింది. రెండున్నర నెలల్లోనే 300 టీఎంసీలు రావడం గమనార్హం. ఈ క్రమంలో వందేళ్ల ప్రాజెక్టు రికార్డులు బద్దలయ్యాయి. గతంలో 1983లో భారీ వరదలు వచ్చాయి. ఆ ఏడాది 163 టీఎంసీల వరద వచ్చింది. ఈసారి ఈ రికార్డును చెరిపేయడమే కాకుండా దాదాపు రెట్టింపు స్థాయిలో వరదలు రావడం గమనార్హం. ఈ సీజన్‌లో ప్రాజెక్టు నుంచి ఇప్పటివరకు 285 టీఎంసీలకుపైగా నీటిని విడుదల చేశారు.

మంజీర నదిలో వరద పరవళ్లు..

ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావడం, నిజాంసాగర్‌ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో మంజీర రెండున్నర నెలలనుంచి జీవనదిలా ప్రవహిస్తూనే ఉంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు వరద గేట్లతో పాటు నల్లవాగు, కల్యాణి, సింగితం రిజర్వాయర్‌ల ద్వారా మంజీర నదిలో ఈ సీజన్‌లో 350కి పైగా టీఎంసీల వరద నీరు ప్రవహించింది.

కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సింగూరు ప్రాజెక్టు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో మంజీర నది ద్వారా నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో వస్తోంది. శనివారం నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 37,113 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు 5 గేట్ల ద్వారా 43,135 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగుల(17.802 టీఎంసీలు)తో నిండు కుండలా ఉంది.

‘నిజాంసాగర్‌’ మరో రికార్డ్‌!1
1/1

‘నిజాంసాగర్‌’ మరో రికార్డ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement