అత్యాచార నిందితుడి అరెస్ట్
కామారెడ్డి క్రైం: నాలుగు రోజుల క్రితం పాల్వంచ మండలం ఫరీదుపేట సమీపంలో పొలం పనులకు ఒంటరిగా వెళ్తున్న మహిళపై రైస్ మిల్లులో పనిచేసే ఓ బిహార్ కూలీ దాడి చేసి అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని పోలీసులు మహారాష్ట్రలో గుర్తించి పట్టుకున్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర వివరాలు వెల్లడించారు. ఈ నెల 26న ఓ మహిళ పొలం పనులకు వెళ్తుండగా ఓ యువకుడు వెనుక నుంచి వచ్చి దాడి చేశాడు. ఆమెను సమీపంలోని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నిందితుడిని ఈ ప్రాంతంలో ఉండే శ్రీ మణికంఠ రైస్‌మిల్లులో పనిచేసే బిహారీ కూలీ రాహుల్ కుమార్‌గా గుర్తించారు. పరారీలో ఉన్న అతడిని పట్టుకోడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. అతడిని కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు. నిదింతుడిని పట్టుకోవడంలో విశేషంగా కృషి చేసిన సీఐలు రామన్, శ్రీనివాస్, రాజారెడ్డి, నరేశ్, ఎస్సైలు అనిల్, రంజిత్, ఆంజనేయులు, రాజు, సిబ్బంది శ్రీనివాస్, గణపతి, రవి, శ్రీను లను అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహా రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


