ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత
● ముందుకు సాగని నిర్మాణాలు
● అధికారుల చుట్టూ తిరుగుతున్న
లబ్ధిదారులు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఇసుక కొరత కారణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు.గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయించాలని, క్షేత్రస్థాయిలోని అధికారులపై ఉన్నతాధికారులు ఒకవైపు ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాని ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక అందుబాటులో లేకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నాగిరెడ్డిపేట మండలం సమీపంలోని మంజీర నది నిండుగా వరదనీరు ప్రవహిస్తుండటంతో ప్రస్తుతం నదిలో ఇసుక తేలే పరిస్థితులు ఇప్పట్లో లేవు. దీంతోపాటు మండలంలోని పోచారం పెద్దవాగులో సైతం నీరుండటం వల్ల అందులో నుంచి కూడా ఇసుకను తీసే పరిస్థితి లేదు. గ్రామాల శివారుల్లో చెరువులు, కుంటలు సైతం నిండుగా ఉన్నాయి. ఈ క్రమంలో నాగిరెడ్డిపేట మండలంలో ఇసుక కొరత తీవ్రంగా ఉంది.
కొన్నిగ్రామాల్లో అరకొరగా ఇసుక నిల్వలు ఉన్నప్పటికీ దాని ధర ఎక్కువగా ఉందనే కారణంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆ ఇసుకను కొనుగోలు చేసేందు కు వెనుకంజ వేస్తున్నారు. మండలంలో ప్రస్తుతం నెలకొన్న ఇసుక కొరత వల్ల చాలా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఎక్కువ ధరకు ఇసుకను కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేని కొందరు లబ్ధిదారులు ఇళ్ల నిర్మా ణాలను నిలిపివేశారు. అధికారులు చొరవ చూపి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం అనువైన ధరకు ఇ సుకను ఇప్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.


