క్రైం కార్నర్
ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి
● మృతుడి తల్లికి తీవ్ర గాయాలు
నందిపేట్: ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలపాలైన ఘటన నందిపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్యాంరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కుద్వాన్‌పూర్ గ్రామానికి చెందిన బ్యాగరి పోశెట్టి(29) పని నిమిత్తం తన తల్లి లక్ష్మితో బైక్‌పై నిజామాబాద్‌కు శుక్రవారం ఉదయం బయలుదేరాడు. నందిపేట సమీపంలోని బంగారు మైసమ్మ మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి వీరిని ఢీకొన్నది. ప్రమాదంలో పోశెట్టి తలకు బలయమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై కూర్చున్న తల్లి లక్ష్మికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోశెట్టి మృతి విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకొని రాస్తారోకో చేశారు. పోలీసులు, ఆర్టీసీ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని ఆర్టీసీ అధికారులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. మృతుడి భార్య రూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో ఒకరు ..
బోధన్‌రూరల్: సాలూర మండల కేంద్రంలో మహమ్మద్ పాషా(52) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహమ్మద్ పాషా చిన్నప్పటి నుంచి ఎడమ కాలికి పోలియోతో బాధపడుతున్నాడు. అతనికి పెళ్లికాకపోవడంతో ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో పడుకున్నచోటే చనిపోయి ఉండగా కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి తమ్ముడు అహ్మద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
క్రైం కార్నర్
క్రైం కార్నర్


