నివాస గుడిసె దగ్ధం
సిరికొండ: మండలంలోని సర్పంచ్ తండాలో మెగావత్ సరోజకు చెందిన నివాసపు గుడిసె ప్రమాదవశాత్తు శుక్రవారం దగ్ధమైనట్లు ఎమ్మారై నాగన్న, మాజీ సర్పంచ్ సర్యనాయక్ తెలిపారు. గుడిసెలో నుంచి పొగలు రావడం గమనించిన తండా వాసులు మంటలను ఆర్పివేశారు. విద్యుత్‌షాక్‌తో జరిగిన ప్రమాదంలో నిత్యావసర సరుకులు, వంట సామగ్రి, ఇతర వస్తువులు కాలిపోయినట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎమ్మారై నాగన్న సందర్శించి రూ. లక్షా యాభై వేల ఆస్తి నష్టం సంభవించినట్లు పంచనామా నిర్వహించారు.
డొంకేశ్వర్: మండలంలోని దత్తాపూర్–మారంపల్లి గ్రామాల మధ్య వడ్ల లారీ బోల్తా పడింది. శుక్రవారం మారంపల్లి నుంచి వడ్ల బస్తాలను లోడ్ చేసి వేరే ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. పరిమితికి మించి ధాన్యం బస్తాలను లోడ్ చేసి రవాణా చేస్తుండగా లారీ అదుపు తప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే లారీ పంట పొలాల్లో బోల్తా పడగా డ్రైవర్ స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
నాగిరెడ్డిపేట: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చీనూర్‌లో చోటు చేసుకుంది. ఇన్‌చార్జి ఎస్‌హెచ్‌వో మనోహర్‌రావు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేకల అంజవ్వ(52) కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. దీంతో జీవితంపై విరక్తితో గురువారం రాత్రి గ్రామశివారులోని హనుమాన్ ఆలయ సమీప వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుమారుడు కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి ఎస్‌హెచ్‌వో తెలిపారు.


