
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
కామారెడ్డి క్రైం : పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ్ కాంపిటీషన్(ఎన్‌ఎస్‌ిపీసీ) 2025 పో స్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ మార్పులతో కలిగే ప్రభావాల నుంచి రక్షణ విషయంలో విద్యార్థులు పర్యావరణ నైపుణ్యాలను పెంచుకోవడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. మొక్కలు నాటడం, నీటి సంరక్ష ణ, వ్యర్థాలను వేరు చేయడంలాంటి పద్ధతులను ప్రతి విద్యార్థికి అలవాటు చేయాలన్నారు. కేంద్ర విద్య, పర్యావరణ మంత్రిత్వ శాఖల సహకారంతో ఈ పోటీలను ‘హరిత్, ద వే ఆఫ్ లైఫ్’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారన్నారు. 1 నుంచి 5, 6 నుంచి 8, 9 నుంచి 12 వ తరగతి, డిగ్రీ, పీజీ, పరిశోధన విద్యార్థులు, సాధారణ పౌరుల విభాగాల్లో వేర్వేరుగా పోటీలు ఉంటాయన్నారు. రిజిస్ట్రేషన్లకు ఆగస్టు 21 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈకో మిత్ర అనే మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. హిందీ, ఇంగ్లిష్ సహా అనేక భాషలలో క్విజ్ పోటీ అందుబాటులో ఉంటుందన్నారు. మొక్క నాటుతు గానీ, సంరక్షిస్తూ గానీ, వ్యర్థాలను వేరు చేస్తున్న ఫొటో గానీ సెల్ఫీ తీసి తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని సూచించారు. పాల్గొన్న ప్రతి విద్యార్థికి ఇ–సర్టిఫికెట్ ఇస్తామన్నారు. ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన విద్యాసంస్థలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు. అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, డీఈవో రాజు, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, ఆర్డీవో వీణ, జిల్లా సైన్స్ అధికారి సిద్దిరాంరెడ్డి పాల్గొన్నారు.
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి
కామారెడ్డి క్రైం: మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మహిళా సాధికారత కేంద్రం, సోనియా శంకర్ ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో పథకంలో భాగంగా మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించారు. ఇందులో శిక్షణ పూర్తి చేసుకున్న 60 మందికి సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి ప్రమీల, ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ్
కాంపిటీషన్ పోస్టర్ల ఆవిష్కరణ