
హత్య!
వారానికో
పిట్లం మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన జిన్నా లక్ష్మి (50) ఈనెల 3న హత్యకు గురైంది. అప్పుగా తీసుకున్న డబ్బులు ఇవ్వాలని అడిగిన లక్ష్మిని.. ఆమె అల్లుడు కమ్మకత్తితో దాడి చేసి చంపాడు. ఈ కేసులో అల్లుడు బాలరాజును పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపించారు.
ఈ ఏడాది జనవరి 19న రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన పొక్కిలి రవి (41) అనే వ్యక్తి ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. భూ వివాదంలో సొంత అన్న సుఫారీ ఇచ్చి హత్య చేయించినట్టు పోలీసులు తేల్చారు. ఈ కేసులో అన్న కిష్టయ్య, అన్న కొడుకుతో పాటు మరో ముగ్గురు జైలు పాలయ్యారు.
గతనెల 5న పిట్లం మండలం చిన్నకొడప్‌గల్ పంచాయతీ కార్యదర్శి ధరావత్ కృష్ణ (28) హత్యకు గురయ్యాడు. కేసును పరిశోధించిన పోలీసులు.. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే దారుణం జరిగిందని తేల్చారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు.
మే 24న లింగంపేట మండలం అయ్యపల్లి తండాకు చెందిన దేవసోత్ ఫకీరా (46) హత్యకు గురయ్యాడు. కుటుంబంలో పెళ్లి విషయంలో తలెత్తిన గొడవల నేపథ్యంలో ఫకీరాను ఆయన కొడుకు ప్రకాశ్ గొడ్డలితో తలపై కొట్టడంతో చనిపోయాడు.
కొన్నాళ్ల క్రితం పిట్లం మండల కేంద్రానికి చెందిన సాబేరా బేగం(60)ను ఆమె కొడుకు షాదుల్ రోకలిదుడ్డుతో తలపై కొట్టడంతో తీవ్ర గాయాలపాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. గతంలో షాదుల్ తన సోదరుడిని హతమార్చాడు. ఆ కేసులో ఫిర్యాదుదారైన తల్లితో కేసు రాజీ కోసం వచ్చి హతమార్చాడు.
ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాలకు తోడు కుటుంబ కలహాలు హత్యలకు పురిగొల్పుతున్నాయి. ఆగ్రహాన్ని నియంత్రించుకోలేని మనిషి మృగంలా మారుతున్నాడు. మద్యం మత్తు ఆపై కోపోద్రేకంతో విచక్షణ కోల్పోయి హత్యలకు పాల్పడుతున్నాడు. జిల్లాలో వారానికో హత్య కేసు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
● జిల్లాలో పెరుగుతున్న నేర సంస్కృతి
● మద్యం మత్తు, క్షణికావేశంతో
దారుణాలు
● ఆస్తి తగాదాలు, వివాహేతర
సంబంధాలతోనే ఎక్కువ నేరాలు
● ఆందోళన కలిగిస్తున్న ఘటనలు