
డంపింగ్‌యార్డులున్నా.. నిరుపయోగమే
మద్నూర్(జుక్కల్): ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి వంద శాతం పారిశుధ్యం సాధించాలన్న లక్ష్యం నెరవేరేలా లేదు. గ్రామాల్లో సేకరించిన చెత్తను ఆరు బయట, ప్రధాన రహదార్ల పక్కన పడేయటంతో డంపింగ్ యార్డులు ఉన్నా లేనట్టుగా ఉన్నాయి. అదే విధంగా పడేసిన చెత్తకు నిప్పు పెడుతుండడంతో దుర్గంధం వెదజల్లుతుండడంతో పాటు పొగతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలా రోడ్ల పక్కన చెత్తను వేస్తూ నిప్పుపెడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదు. పలు గ్రామాల్లో చెత్త నిర్వహణ ఇంకా చెత్తగా మారింది. సర్పంచుల పదవీకాలం పూర్తయి ఏడాదిన్నర దాటినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ప్రజాప్రతినిధులు లేక పారిశుధ్య పనులను పట్టించుకునే వారు కరువయ్యారు. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించినప్పటికి గ్రామాలపై వారి పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.
పొగతో తప్పని తిప్పలు
వర్మి కంపోస్ట్ షెడ్లలో చెత్తను వేరు చేయడం, ఎరువులు తయారు చేయడం వంటి పనులు చేపట్టడం లేదు. పంచాయతీల్లో సేకరించిన చెత్తతో పాటు ప్లాస్టిక్ వస్తువులు, తదితర వ్యర్థాలను అన్నింటినీ ఆరుబయటే తగలబెడుతున్నారు. వచ్చే పొగతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. కుళ్లిన వ్యర్థాలతో వచ్చే వాసనను భరించలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు.
నీరుగారుతున్న లక్ష్యం
పల్లెలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పంచాయతీల ఆదాయాన్ని పెంచాలన్న లక్ష్యంతో ఒక్కోదానికి రూ.2.50 లక్షల చొప్పున ఏర్పాటు చేసిన వర్మి కంపోస్ట్ సెగ్రిగేషన్ షెడ్లు ఉమ్మడి మండలంలో నిరుపయోగంగా మారాయి. సేకరించిన చెత్తను సెగ్రిగేషన్ షెడ్లలో వేరు చేసి ఎరువు తయారు చేసి అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించగా అవకాశాలున్నప్పటికీ వాటిని వినియోగించకపోవడంతో ప్రభుత్వానికి వీటి ద్వారా వచ్చే ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. ఎరువుల తయారీకి సంబంధించి వ్యవసాయ, పంచాయతీ శాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అవి నిరాదరణకు గురై లక్ష్యం నీరుగారిపోతోంది.
ఎక్కడ పడితే అక్కడే చెత్త
వేస్తున్న ప్రజలు
స్పష్టంగా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లోపం
మరుగున పడిన కంపోస్ట్ ఎరువు తయారీ
పట్టించుకోని అధికారులు
వినియోగంలోకి తీసుకురావాలి
రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన డంపింగ్, వర్మి కంపోస్టు షెడ్లు నిరుపయోగంగా ఉంటున్నాయి. చెత్త వేసేందుకు షెడ్లు నిర్మించినప్పటికీ వాటిని వినియోగంలోకి తీసుకురాకుండా నిర్లక్ష్యంగా వదిలేయడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. – రవీందర్, మద్నూర్
నిప్పు పెట్టకుండా చూడాలి
చెత్తను రోడ్ల పక్కన వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. రోడ్ల పక్కన చెత్త వేయడంతో అది కుళ్లి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో ఆయా మార్గాల గుండా వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. –పండరి, హండెకేలూర్

డంపింగ్‌యార్డులున్నా.. నిరుపయోగమే

డంపింగ్‌యార్డులున్నా.. నిరుపయోగమే