యువకుడి దుర్మరణం
నల్లజర్ల: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన పుల్లలపాడు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లికి చెందిన శాయలి శివరామకృష్ణ (20) ఏలూరులో సీఆర్‌ఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. అదే కళాశాలలో చదివే స్నేహితుడి బంధువు దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన అంకెం సుబ్రహ్మణ్యం, శ్రీదుర్గ దంపతులు ద్వారకాతిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భీమడోలు బస్టాండ్‌కు వచ్చేసరికి రాత్రి కావడంతో వారిని యాదవోలులో దించమని స్నేహితుడు కోరాడు. శివరామకృష్ణ తన బైక్‌పై భీమడోలు వచ్చి వారిద్దరినీ తీసుకు వెళుతుండగా పుల్లలపాడు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో శివరామకృష్ణ తలకు గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన సుబ్రహ్మణ్యం, శ్రీదుర్గలను హైవే పోలీసులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై మోహనరావు తెలిపారు.


