ప్రభుత్వ స్కూళ్లలో 4 వేల మంది విద్యార్థులు తగ్గారు
పిఠాపురం: ఈ ఏడాది జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో ఏకంగా 4 వేల మంది విద్యార్థులు తగ్గిపోయారని జిల్లా విద్యా శాఖాధికారి (డీఈఓ) పిల్లి రమేష్ అన్నారు. నాణ్యమైన విద్య అందించకుండా ఇదే పరిస్థితి కొనసాగితే ఉపాధ్యాయులు దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఆదర్శ కాలేజీలో మండల స్థాయిలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాధమిక పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయన్నారు. ఏ ఒక్క విద్యార్థికీ అక్షరం వచ్చినట్లు కనిపించడం లేదన్నారు. ‘మీ పిల్లలకు రూ.10 వేల జీతం పొందే ప్రైవేటు ఉపాధ్యాయుల వద్ద చదువు చెప్పిస్తూ.. అక్కడ చదువు సక్రమంగా లేకపోతే నిలదీస్తారు. మరి వేలకు వేలు జీతం తీసుకునే మీరు చదువు చెప్పకపోతే పిల్లల తల్లిదండ్రులు నిలదీయరా?’ అని తీవ్రంగా ప్రశ్నించారు. ఎలిమెంటరీ పాఠశాలల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో అక్షర పరిజ్ఞానం అందించకపోతే ఉన్నత తరగతులకు వెళ్లేకొద్దీ చదువులో వెనకబడి వారి అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని అన్నారు. ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయుడే విద్యార్థి అభివృద్ధికి పిల్లర్ నిర్మించాలని, అలా లేనందువల్లనే ఏటేటా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు తగ్గుతూ వస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణం తెలుసుకోవాలని సూచించారు. ప్రైవేటు స్కూలులో ఉన్నదేమిటో, ప్రభుత్వ స్కూల్లో లేనిదేమిటో అందరికీ తెలిసేలా చేయాలని అన్నారు. విద్యార్థికి ఆదర్శంగా నిలవాలని, కానీ తరగతి గదిలో ఉపాధ్యాయుల నడవడిక, సెల్ ఫోన్లో మాట్లాడుతూ గడపడం వంటి విషయాలను విద్యార్థులు గమనిస్తారనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. ఇంటికెళ్లి తమ టీచర్ ఏమీ చెప్పడం లేదని, ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటున్నారని పిల్లలు చెబితే ఉపాధ్యాయుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. దీనివల్ల ఉద్యోగ భద్రత కూడా కరువవుతుందన్నారు. పిల్లలకు వారి పేర్లు రాసుకోవడం కూడా రావడం లేదని, చిన్నచిన్న పదాలు కూడా రాయలేని పరిస్థితి నెలకొందంటే ఉపాధ్యాయుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలని కోరారు. ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి పాఠశాలలను రక్షించుకోవాలన్నారు. విద్యార్థిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని స్పష్టం చేశారు. ప్రాథమిక స్థాయి విద్యను దుర్వినియోగం చేయవద్దని, విద్యార్థి బంగారు భవిష్యత్తుకు ప్రాథమిక దశలోనే పునాది వేయాలని ఉపాధ్యాయులకు డీఈఓ రమేష్ సూచించారు. విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చకపోతే, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచకపోతే ఉపాధ్యాయుల మనుగడకే ప్రమాదం తెచ్చుకున్నవారవుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఈఓలు శ్రీనివాస్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఇదే పరిస్థితి కొనసాగితే టీచర్ల
పరిస్థితి దారుణంగా మారుతుంది
ఫ డీఈఓ రమేష్


