సత్యదేవునికి రూ.40 లక్షల ఇల్లు విరాళం
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణస్వామి వారి దేవస్థానానికి లింగంపల్లి వేంకట సూర్య సత్యనారాయణ స్థానిక ఈరంకి వారి వీధిలోని రూ.40 లక్షల విలువైన ఇంటిని సోమవారం విరాళంగా సమర్పించారు. ఆ మేరకు ఈఓ వీర్ల సుబ్బారావుకు ఇంటి పత్రాలు అందజేశారు. 98,51 చదరపు గజాల స్థలంలోని పెంకుటిల్లును ఆయన అందజేశారు. సత్యనారాయణ తండ్రి సోమన్నదొర గతంలో దేవస్థానంలో ఉద్యోగిగా సేవలందించారు. దాతను ఈఓ ఘనంగా సత్కరించారు.
సామర్లకోట మీదుగా
శ్రీశైలానికి బస్సు
సామర్లకోట: ఇప్పటి వరకూ సామర్లకోట మీదుగా శ్రీశైలానికి బస్సు లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడేవారు. వారి సమస్యను పరిష్కరించేలా కాకినాడ ఆర్టీసీ డిపో నుంచి సామర్లకోట మీదుగా శ్రీశైలం వెళ్లడానికి ప్రత్యేక బస్సు సర్వీసును అధికారులు ప్రవేశపెట్టారు. ఈ బస్సు ప్రతి రోజూ రాత్రి 7.45 గంటలకు కాకినాడలో బయలుదేరి, సామర్లకోట ఆర్టీసీ కాంప్లెక్స్‌కు 8.15 గంటలకు వస్తుంది. ఈ బస్సు పెద్దాపురం, రంగంపేట, రాజానరం, రాజమహేంద్రవరం మీదుగా మర్నాడు ఉదయం 9 గంటలకు శ్రీశైలం చేరుతుంది. భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు. టిక్కెట్ల రిజర్వేషన్‌కు 99592 25564 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. బస్సుకు సరిపడే భక్తులుంటే వారు కోరిన చోటుకు బస్సును పంపిస్తామని తెలిపారు.
కాకినాడ వైద్యులకు అవార్డు
కాకినాడ రూరల్: భారతీయ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ (ఐఎస్‌సీసీఎం) నుంచి 2025–26 సంవత్సరానికి గాను అత్యున్నత ప్రెసిడెన్షియల్ సిటేషన్ అవార్డుకు కాకినాడకు చెందిన వైద్యులు సిరిపరపు రామకృష్ణ, ఎస్‌ఎస్‌సీ చక్రరావు ఎంపికయ్యారు. క్రిటికల్ కేర్ వైద్య రంగంలో అందించిన సేవలకు గాను డాక్టర్ రామకృష్ణకు ఈ అవార్డు ప్రకటించినట్టు ఐఎస్‌సీసీఎం అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ సామవేదం తెలిపారు. అలాగే, సీపీఆర్ ప్రోగ్రామ్ ద్వారా జీవ రక్షణపై అవగాహన పెంపొందిస్తున్న డాక్టర్ చక్రరావుకు కూడా అవార్డు లభించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న చైన్నెలో జరిగే కార్యక్రమంలో వారు ఈ అవార్డు స్వీకరించనున్నారు. రామకృష్ణ, చక్రరావులను ఐఎస్‌సీసీఎం కాకినాడ బ్రాంచి చైర్మన్ లక్ష్మీనారాయణ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు అభినందించారు.
పీజీఆర్‌ఎస్‌కు 388 అర్జీలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 388 అర్జీలు సమర్పించారు. వారి నుంచి డీఆర్‌ఓ జె.వెంకటరావుతో పాటు వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. బియ్యం కార్డుల మంజూరు, ఇళ్ల స్థలాలు, ఆన్‌లైన్‌లో భూమి వివరాల నమోదు, పూడికల తొలగింపు, పారిశుధ్యం, వివిధ సంక్షేమ పథకాల లబ్ధి తదితర అంశాలు పరిష్కరించాలని ప్రజలు అర్జీలు సమర్పించారు. ఈ అర్జీలను గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు డీఆర్‌ఓ సూచించారు.


