అవగాహన, ఆచరణలే రక్ష
కాకినాడ క్రైం: ఎయిడ్స్ వ్యాప్తిని నివారించేందుకు అవగాహన, ఆచరణలే రక్ష అని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) జె.నరసింహ నాయక్ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అనుబంధ ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యాన ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినాన్ని సోమవారం నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో బెలూన్లు ఎగరవేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో విద్యార్థులతో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. బాలాజీ చెరువు సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి ఎయిడ్స్ అవగాహన నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో డీఎంహెచ్‌ఓ నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ మనీష, రెడ్‌క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడీ రామారావు మాట్లాడుతూ, ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన విస్తృతమవుతున్న కొద్దీ కేసులు తగ్గుతాయని అన్నారు. హెచ్‌ఐవీ బారిన పడిన బాలలతో అధికారులు సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో డీఎల్‌ఓ డాక్టర్ చలమయ్య, డీసీహెచ్‌ఎస్ మహేష్, రంగరాయ వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగాధిపతి ప్రసన్న కుమార్, జీజీహెచ్ సీఎస్ ఆర్‌ఎంవో కోమల తదితరులు పాల్గొన్నారు.


