
దళిత మహిళపై దాడి అమానుషం
అనపర్తి: దుప్పలపూడి గ్రామంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళ కొమ్ము బుజ్జిపై దాడికి పాల్పడిన టీడీపీ నేత ఎన్.వెంకటరెడ్డి, అతని అనుచరులను 24 గంటల్లో అరెస్టు చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని మాదిగ న్యాయవాదుల సమాఖ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు సంయుక్తంగా డిమాండ్ చేశారు. బుధవారం అనపర్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బుజ్జిని వారు పరామర్శించారు. నిందితులు ఎంత పలుకుబడి కలిగిన వారైనా భయపడాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని బాధితురాలికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాదిగ న్యాయవాదుల సమాఖ్య అధ్యక్షుడు కొండేపూడి ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ ఈ నెల 6న దుప్పలపూడి గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత ఎన్.వెంకటరెడ్డి (ఎన్‌వీ) దళిత మహిళ బుజ్జిపై అమానుషంగా దాడి చేయడంతో మాదిగ సంఘాల తరఫున నిజ నిర్ధారణ కమిటీగా తాము ఇక్కడకు వచ్చామని తెలిపారు. తమ పరిశీలనలో ఇది కచ్చితంగా కుల వివక్షతోనే జరిగిన దాడిగా గుర్తించామన్నారు. గతంలో జరిగిన ప్రమాదంలో పోలీసులు కేసు నమోదు చేయడం బుజ్జి మరిది వీరబాబు బెయిల్ పై రావడం వ్యవహారం కోర్టులో నడుస్తుండగా దళితులను, అమాయకులను భయబ్రాంతులకు గురి చేస్తూ వెంకటరెడ్డి తన అధికార మదంతో ఇంటి వద్ద ప్రైవేట్ పంచాయితీ నిర్వహించడమేంటని ఆయన ప్రశ్నించారు. చట్టవిరుద్ధంగా ఇటువంటి పనులను చేస్తున్న వెంకటరెడ్డిని మూడు రోజులు కావొస్తున్నా పోలీసులు అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్సీఎస్ నాయకులు కొత్తపల్లి ప్రసాద్, ధూళి జయరాజు, ఆకుమర్తి చిన్నా, మానవ హక్కుల సంఘ సభ్యురాలు ఖండవిల్లి లక్ష్మి, ఎమ్మార్పీఎస్ నాయకులు గాలంకి నాగేశ్వరరావు, పల్లేటి శ్రీనువాస్ తదితరులు పాల్గొన్నారు.
నిందితుడు ఎన్‌వీ రెడ్డిని అరెస్టు చేయాలి
మాదిగ సంఘాల నాయకుల డిమాండ్