
గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
గోకవరం: అప్పటి వరకూ విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విధి నిర్వహణలో గుండెపోటుకు గురై తనువు చాలించాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. గోకవరం గ్రామానికి చెందిన బొమ్మగంటి నాగభూషణం (57) తంటికొండ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో లెక్కల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. బుధవారం పాఠశాలకు వెళ్లిన ఆయన రెండు తరగతుల్లో బోధించారు. ఇంటర్వెల్ సమయంలో ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోగా తోటి ఉపాధ్యాయులు వెంటనే ఆయన్ని 108 వాహనంలో గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన ఇటీవల రంపయర్రంపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ నుంచి బదిలీపై తంటికొండకు వచ్చారు.
కుమార్తె వివాహం చేసిన నెలలోనే..
ఉపాధ్యాయుడు నాగభూషణంకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు గత నెలలో ఘనంగా వివాహం జరిపించారు. ఇంతలోనే ఈ విషాద ఘటన జరగడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.