చక్రస్నానానికి.. చెక్కిన కోనేరు | Sakshi
Sakshi News home page

చక్రస్నానానికి.. చెక్కిన కోనేరు

Published Wed, May 22 2024 12:45 AM

చక్రస్నానానికి.. చెక్కిన కోనేరు

అన్నవరం: వార్షిక కల్యాణ మహోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించే సత్యదేవుని శ్రీచక్రస్నాన మహోత్సవానికి పంపా జలాశయంలో కృత్రిమంగా కోనేరు సిద్ధం చేశారు. గత ఏడాది తగినన్ని వర్షాలు లేకపోవడం.. ఉన్న నీటిని రబీ సాగుకు విడుదల చేయడంతో పంపా నదిలో నీరు అడుగంటిన విషయం విదితమే. దీనిపై ‘సాక్షి’ ‘ఎండిపోయినది శీర్షికన గత నెల పదో తేదీన కథనం ప్రచురించింది. సత్యదేవుని చక్రస్నానానికి నీటి సమస్య ఉత్పన్నమవుతుందని ఆ కథనంలో పేర్కొంది. దీనిపై స్పందించిన అన్నవరం దేవస్థానం ఈఓ కె.రామచంద్ర మోహన్‌ సత్యదేవుని కల్యాణ మహోత్సవాలకు వచ్చే భక్తుల అవసరాలకు, స్వామివారి శ్రీచక్రస్నానానికి ఏలేరు రిజర్వాయర్‌ నుంచి 200 క్యూసెక్కుల నీటిని పంపా జలాశయానికి విడుదల చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. అయితే, అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా ఉండటంతో ఈ పని జరగలేదు. ఈ నేపథ్యంలో పంపా ఒడ్డున పవర్‌ హౌస్‌ వద్ద జలాశయం గర్భంలో జేసీబీతో తాత్కాలికంగా కోనేరులా తవ్వి, దేవస్థానం బోరు నుంచి నీరు నింపుతున్నారు. ఈ పనులను ఈఓ రామచంద్ర మోహన్‌ మంగళవారం పరిశీలించి, సిబ్బందికి తగు సూచనలిచ్చారు. ఈ కోనేరులో గురువారం ఉదయానికి సుమారు నాలుగు అడుగుల లోతున నీరుండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్రీచక్రస్నానం నిర్వహించే పండితులు, పుణ్యస్నానాలు చేసే భక్తులకు బురద అంటుకోకుండా కోనేరు అడుగున ఇసుక బస్తాలు వేస్తున్నామని ఈ పనులను పర్యవేక్షిస్తున్న ఎలక్ట్రికల్‌ డీఈ సత్యనారాయణ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement