● రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
గద్వాల: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. గద్వాల మండలం తెలుగోనిపల్లిలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రం ఇన్‌చార్జి గైర్హాజరు కావడం.. మహిళా సంఘాల సభ్యులు లేకపోవడం.. రైతులు ఎండలో గంటల తరబడి వేచి ఉండటాన్ని గుర్తించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రంలో ఐకేపీ మహిళా సంఘాల స్థానంలో ఇతరులు వ్యవహారాలు నిర్వహించడాన్ని గమనించి తీవ్రంగా మందలించారు. మహిళా సంఘాల సభ్యులే కొనుగోలు కేంద్రం నిర్వహించాలని స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించబోమని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని.. ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల వద్ద ట్యాబ్ ఎంట్రీలు, రిజిస్టర్ల నిర్వహణ లేకపోవడం, మిల్లులను కేటాయించకపోవడం వంటి సమస్యలతో ఓపీఎంఎస్‌లో తీవ్ర జాప్యం జరిగి, రైతులకు సకాలంలో డబ్బులు రావడం లేదన్నారు. కొన్ని మిల్లులకే అధిక కేటాయింపులు చేసి, మిగిలిన మిల్లులకు సరైన కేటాయింపులు లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్.. అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి ఏటా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపడుతున్నప్పటికీ లోపాలను అధిగమించకపోతే ఎలా ప్రశ్నించారు. మొక్కజొన్న కొనుగోలు విషయంలోనూ అవకతవకలకు చోటు లేకుండా పర్యవేక్షణ చేసేందుకు ప్రత్యేకాధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఎస్‌డీసీ కృష్ణ, సివిల్ సప్లయ్ డీఎం స్వామికుమార్, మేనేజర్ విమల, డీఏఓ వీరప్ప ఉన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్‌లో ఒకరోజు వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించే బాధ్యత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. ఎవరైనా బాల్యవివాహాలకు సహకరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవనే విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు ఉదయం అల్పాహారం కూడా అందించనున్నట్లు చెప్పారు. జిల్లాలోని పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో మరమ్మతులు చేయడమే కాకుండా మన ఊరు–మన బడిలో మంజూరైన అదనపు తరగతి గదుల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. మెరుగైన పనితీరు కనబరిచే సర్పంచులకు ప్రతి మండలం నుంచి ఐదుగురు చొప్పున ఆగస్టు 15న అవార్డులు అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం పదో తరగతి ఫలితాల్లో టాపర్స్‌గా నిలిచిన వివిధ పాఠశాలల విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి, ఇన్‌చార్జి డీవైఎస్‌ఓ రామలింగేశ్వర్‌గౌడ్, డీపీఓ శ్రీకాంత్ పాల్గొన్నారు.


