గద్వాల: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఒకటో తరగతి ప్రవేశానికి షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు ఒక సీటు కేటాయించారని.. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2026 జూన్ 1 నుంచి 2020 మే 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2లక్షలు మించరాదన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఎంపిక జూన్ 1న కలెక్టరేట్‌లో లక్కీడిప్ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తు ఫారాలు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ కార్యాలయంలో పొందవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం 94917 67689, 79814 88878 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్‌గా చంద్రశేఖర్
అలంపూర్: స్థానిక మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్‌గా చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన శంకర్ ఇటీవల నారాయణపేట జిల్లాకు బదిలీ కావడంతో అయిజ మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన గతంలో అలంపూర్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. తిరిగి ఇదే మున్సిపాలిటీకి ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టారు.
ఐకేపీ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
గద్వాల: మండలంలోని తెలుగోనిపల్లిలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణను పట్టించుకోని ఐకేపీ ఉద్యోగులపై కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ సస్పెన్షన్ వేటు వేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగోనిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. కేంద్రం నిర్వహణలో లోపాలను గుర్తించారు. దీంతో వీఏఓ అలివేలు, సీపీ రంగన్నలను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని.. కొనుగోలు కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యం వహించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
జూన్ 2 నాటికి
పీఆర్సీ అమలుచేయాలి
గద్వాలన్యూటౌన్: ప్రభుత్వం వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకొని జూన్ 2వ తేదీ నాటికి అమలుచేయాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి కోరారు. బుధవారం జిల్లాకేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్రాంత ఉద్యోగులకు హెల్త్‌కార్డులు జూన్1 నాటికి పంపిణీ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ. 6వేల కోట్ల బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారని.. ఈ మేరకు జీపీఎఫ్, లీవ్ ఎనాన్స్‌మెంట్, గ్రాట్యూటీలో విశ్రాంత ఉద్యోగులకు సీనియార్టీ ప్రకారం టోకెన్ ఇవ్వాలని కోరారు. అనంతరం ఆయనను పలువురు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి, ప్రధాన కార్యదర్శి చక్రధర్, అసోసియేట్ అధ్యక్షుడు బాలకిషన్‌రావు, బీసీరెడ్డి పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.7,511
గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు బుధవారం 42 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,511, కనిష్టంగా రూ. 6,066, సరాసరి రూ. 6,699 ధరలు లభించాయి. 52 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,049, కనిష్టంగా రూ. 3,119, సరాసరి రూ. 5,949 ధరలు పలికాయి. 566 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,339, కనిష్టంగా రూ. 1,651, సరాసరి రూ. 2,189 ధరలు లభించాయి.


