కదిలిన యంత్రాంగం.. | - | Sakshi
Sakshi News home page

కదిలిన యంత్రాంగం..

May 13 2026 12:50 AM | Updated on May 13 2026 12:50 AM

రాజోళి: ‘‘రైతుల కడుపుకొట్టి వ్యాపారుల కడుపు నింపుతారా..? రైతు పేరుతో వచ్చి రైతుల నోటికాడి కూడు నేల పడేస్తారా.?’’ ఇవి సాక్ష్యాత్తు వ్యవసాయశాఖ, డీసీఎస్‌ కార్యాలయ అధికారుల మాటలు. ‘వ్యాపారులకే మద్దతు’ శీర్షికతో సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు కదిలారు. మంగళవారం శాంతినగర్‌ పీఏసీఎస్‌ కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారి రాధ, డీసీఎస్‌ కార్యాలయ ఆడిటర్‌ విశ్వకర్మ ఆచారి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించి రైతులకు వ్యవసాయశాఖ నుంచి జారీ చేసిన టోకెన్లు.. పీఏసీఎస్‌ నుంచి అందిన లోడింగ్‌ అనుమతులను పరిశీలించారు. రికార్డుల్లో చేర్చిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆన్‌లైన్‌లో పంటల నమోదును పరిశీలించారు. రాత్రి సమయంలో ముద్రలు వేసి, బస్తాలను అన్‌లోడు చేసిన రామాపురం గ్రామవాసులను వారు విచారించారు. తాము హైదరాబాద్‌లో ఉంటామని.. అందుకే ధాన్యం అమ్ముకోలేదని వారు తెలియజేశారు. అయినప్పటికీ రాత్రివేళ నిండు బస్తాలకు ముద్రలు వేయడం ఏంటని అధికారులు ఆరా తీశారు. అక్కడి నుంచి వారు చెబుతున్న పొలం వద్ద వెళ్లి, అక్కడ మొక్కజొన్న సాగు చేశారా? లేదా అనే విషయంపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ఇంకా ఎవరైనా అక్రమంగా మొక్కజొన్నల వ్యాపారం చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై విచారణ మొదలైందని.. నిజాలను నిగ్గు తేల్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అధికారుల విచారణ ముగిసే వరకు మొక్కజొన్న లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

అక్రమ దందా ఇలా..

కర్నూలు జిల్లా సుంకేసులకు చెందిన ఓ వ్యాపారి శాంతినగర్‌కు చెందిన కొందరితో సత్సంబంధాలు సాగిస్తున్నాడు. ఇదే అదునుగా ఏపీలో సేకరించిన మొక్కజొన్నలను శాంతినగర్‌కు పంపించగా.. ఇక్కడ వారు ఓ ధరకు కొనుగోలు చేయడం.. పట్టాదారు పాస్‌పుస్తకాల ఆధారంగా ఆ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తూ వస్తున్నారు. కాగా, ఈ వ్యాపారంలో సహకరిస్తున్న కూలీలను ‘సాక్షి’ సంప్రదించగా.. సుంకేసులకు చెందిన ఒకరి పేరు, రామాపురం, శాంతిగనర్‌కు చెందిన కొందరి పేర్లను తెలిపారు. వారితో ‘సాక్షి’ మాట్లాడే ప్రయత్నం చేయగా.. సుంకేసులకు చెందిన వ్యాపారి శాంతినగర్‌కు చెందిన ఒక వ్యక్తితో డబ్బుల పని ఉండి వచ్చానని చెప్పాడు. ఆయన చెప్పిన వ్యక్తితో మాట్లాడగా.. సుంకేసులకు చెందిన వ్యాపారితో మొక్కజొన్నల వ్యాపారం చేస్తున్నానని.. కొనుగోలు కేంద్రాలు మొదలైనప్పటి నుంచి ఇదే పనిలో ఉన్నామని.. లాభం వస్తే ఎక్కడైనా అమ్ముకుంటామని దర్జాగా చెప్పడం గమనార్హం. ఇలా దర్జాగా తమ వ్యాపారం చేసుకుంటున్నారంటే, వారి వెనక ఉన్న అధికారులు వారికి ఎంత అభయం ఇచ్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా రాజకీయ నాయకులు ఎవరూ నోరు మెదపడం లేదనే వాదన ప్రజల నుంచి వెల్లువెత్తుతోంది. మొత్తానికి ‘సాక్షి’ కథనానికి స్పందించిన అధికారులు.. బాధ్యులపై ఏ చర్యలు చేపడతారనే దానిపై వేచి చూడాలి.

మొక్కజొన్న దందాపై విచారణ

పీఏసీఎస్‌ రికార్డుల నుంచి

రైతుల పొలందాక పరిశీలన

లెక్క తేలే వరకు కదలని

మొక్కజొన్న లారీలు

సుంకేసులకు చెందిన వ్యాపారే

కీలక సూత్రధారి?

Advertisement
 
Advertisement
Advertisement