ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయం

May 12 2026 12:50 AM | Updated on May 12 2026 12:50 AM

గద్వాల: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయంగా వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు. గద్వాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యా వారోత్సవాలను కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులతోపాటు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు.

● జనగణన–2027లో భాగంగా గద్వాల మున్సిపాలిటీలో జరుగుతున్న ఇళ్ల నమోదు (హౌస్‌ లిస్టింగ్‌) ప్రక్రియను కలెక్టర్‌ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి ఎన్యూమరేటర్‌ తమకు కేటాయించిన సరిహద్దులోని ఇళ్లను కవర్‌ చేస్తూ మూడు రోజుల్లో మ్యాపింగ్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. భవిష్యత్‌లో ఇంటి నంబర్లు స్పష్టంగా నమోదు చేయాలని రోజుకు కనీసం 20 ఇళ్లను సందర్శించాలని చెప్పారు.

● ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా మండల స్ధాయిలోనే పరిష్కరించాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాష షేక్‌ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌తో కలిసి మొత్తం 69 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.

అర్జీలు స్వీకరించిన ఎస్పీ

గద్వాల క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన 13 మంది అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీ శ్రీనివాసరావు దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం వారి సమస్యలపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అలాగే సివిల్‌ సమస్యలు కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.

సకాలంలో ధాన్యం డబ్బుల చెల్లింపు చేపట్టాలి

ఎర్రవల్లి: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లింపులు చేయాలని జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి స్వామికుమార్‌ అన్నారు. సోమవారం మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎంత మంది రైతులతో ఎంత ధాన్యం సేకరించారని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర వద్ద ఆరబెట్టిన ధాన్యాన్ని చూసి సెంటర్‌లో తేమ శాతం, గింజల పరిమాణాన్ని కొలిచే విధానాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రానికి కేటాయించిన టార్పాలిన్లు, గన్నీ సంచుల వివరాలపై ఆరాతీశారు. రైతుల సాగు ధ్రువీకరణకు సంబంధించి కేంద్రం పరిధిలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఇచ్చే టోకెన్లు పరిశీలించారు. నిర్దేశిత మిల్లులకు ధాన్యం రవాణా ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు చేశాక వివరాలను యాప్‌లో ఎప్పటికప్పుడూ నమోదు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఐకేపీ డీపీఎం విమల, తహసీల్దార్‌ నరేష్‌, ఏఈఓ నరేష్‌ తదితరులున్నారు.

విద్యతోపాటు నైపుణ్యాలు పెంచుకోవాలి

గద్వాల న్యూటౌన్‌: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థినులు చదువుతోపాటు నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ మీనాక్షి అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం స్థానిక ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్య వారోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జాబ్‌ ట్రైనింగ్‌, నైపుణ్యాభివృద్ధిపై మ్యాజిక్‌ ఫౌండేషన్‌తో కళాశాల ఎంఓయూ కుదుర్చుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మ్యాజిక్‌ ఫౌండేషన్‌తో కుదిరిన ఒప్పందం ద్వారా విద్యార్థినులకు ప్రత్యేక జాబ్‌ శిక్షణ, నైపుణ్యాభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో మ్యాజిక్‌ ఫౌండేషన్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్‌ ఎండీ ఫయాజ్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ లక్ష్మీప్రసాద్‌, అధ్యాపకులు సురేష్‌బాబు, దేవుజా, జగన్‌మోహన్‌, సమత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement