మక్క రైతుల అరిగోస | - | Sakshi
Sakshi News home page

మక్క రైతుల అరిగోస

May 11 2026 8:44 AM | Updated on May 11 2026 8:44 AM

ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం

అవస్థలు పడుతున్నాం..

పడిగాపులు కాస్తున్నాం..

ప్రభుత్వం స్పందించాలి..

హమాలీల కొరతతోనే..

అయిజ: రైతులు పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రూ.2,400 మద్దతు ధర ప్రకటించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం తరపున అయిజలో కొనుగోలు కేంద్రం గతనెల 9న అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి నెలరోజులు గడిచినా ఇప్పటి వరకు రైతులను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ముందుగా గన్నీ బ్యాగుల కొరత ఏర్పడటంతో రైతులే గన్నీ బ్యాగులను తెచ్చుకుంటున్నారు. అయితే ఇప్పడు హమాలీల కొరత మరో సమస్యగా మారింది. దీంతో మొ క్కజొన్న కొనుగోలు కేంద్రంకు తరలించి 15 రోజు లు గడిచినా కాంటా వేసిన మొక్కజొన్న బస్తాలను ఇప్పటి వరకు గోదాంకు తరలించకపోవడంతో రైతు లు బస్తాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ అధికారుల తీరును నిరసిస్తూ రైతులు అయిజ– గద్వాల రోడ్డుపై ధర్నా చేసినా వారిలో చలనం రావడం లేదు.

రైతులే తెచ్చుకోవాలి..

రైతులకు సరిపడా గన్నీ బ్యాగులను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేయకపోవడంతో కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. రైతులే గన్నీ బ్యాగులను తెచ్చుకోవాలని మార్క్‌ఫెడ్‌ అధికారులు సూచించారు. అప్పటి నుంచి రైతులు సొంత డబ్బుతో గన్నీ బ్యాగులను ఒక్కొక్కటి రూ.25 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చేది మాత్రం ఒక్కొక్క బ్యాగ్‌కు రూ.15 మాత్రమే. ఈ లెక్కన ఒక్కొక్క బ్యాగుపై రైతు రూ.10 చొప్పున నష్టపోతున్నాడు.

హమాలీల కొరుత...

ప్రతిరోజు కొనుగోలు కేంద్రానికి వందల క్వింటాళ్ల మొక్కజొన్న బస్తాలను రైతులు తరలిస్తున్నారు. అయితే హమాలీల కొరత వలన వచ్చిన దాంట్లో సగం కూడా గోదాంలకు తరలించడం లేదు. బస్తాల్లో నింపి, కాంటా వేసి, లోడింగ్‌ చేసేందుకు రైతు హమాలీలకు 50 కిలోల బస్తాకు రూ.30 చొప్పున చెల్లిస్తున్నాడు. అయితే గోదాంల వద్ద అన్‌లోడ్‌ చేసేందుకు ప్రభుత్వం ఒక్కొక్క బస్తాకు రూ.6.50 మాత్రమే చెల్లిస్తుండడంతో హమాలీలు బస్తాలను అన్‌లోడ్‌ చేయడానికి విముఖత చూపుతున్నారు. దీంతో ట్రాన్స్‌పోర్ట్‌ లారీలు గోదాంల వద్ద రెండు మూడు రోజులు ఆగాల్సి వస్తోంది. ఫలితంగా కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న సంచులు ఎక్కువగా నిల్వ ఉంటున్నాయి.

రోడ్డెక్కి ఆందోళనలు..

మొక్కజొన్నకు ప్రభుత్వం మద్దతు ధర రూ.2,400 ప్రకటించగా బయటి మార్కెట్‌లో కేవలం రూ.1,700 మాత్రమే పలుకుతోంది. ఒక్కొక్క క్వింటాకు రూ.7,00 ధర వ్యత్యాసం ఉండడంతో రైతులందరూ కొనుగోలు కేంద్రానికే మొక్కజొన్న తరలిస్తున్నారు. మొక్కజొన్న బస్తాలు కొనుగోలు కేంద్రంకు రావడం ఎక్కువ, గోదాంలకు వెళ్లడం తక్కువ కావడం వలన బస్తాల నిల్వలు పేరుకుపోతున్నాయి. నెలరోజులైనా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు రోడ్డుపై ధర్నా చేసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

మూడెకరాలు మొక్కజొన్న సాగుచేశాను. 122 క్వింటాళ్ల దిగుబడి రాగా.. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 23 రోజులవుతుంది. తోటి రైతులు కొనుగోలు కేంద్రంకు మొక్కజొన్న తెచ్చి 20 రోజులవుతున్నా కాంటా పట్టిన బస్తాలను గోదాంలకు తరలించకపోవడంతో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలి.

– కురువ నీలప్ప, రైతు, అయిజ

కొనుగోలు కేంద్రంకు మొక్కజొన్నను తరలించి 20 రోజులవుతోంది. ఆరు ఎకరాలు మొక్కజొన్న పంటను సాగు చేస్తే మొత్తం 150 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కాంటా వేశారు కానీ గోదాంకు తరలించలేదు. అన్ని పనులు మానుకొని మొక్కజొన్న బస్తాల వద్ద ప్రతిరోజు పడిగాపులు కాయాల్సి వస్తోంది.

– చాకలి శ్రీను, రైతు, వెంకటాపురం

మొక్కజొన్న పంటను మూడెకరాల్లో సాగు చేశాను. 105 క్వింటాళ్ల మొక్కజొన్నను కొనుగోలు కేంద్రంకు తీసుకొచ్చి 20 రోజులయ్యింది. గోనె సంచులను మేమే తెచ్చుకున్నాం. లోడింగ్‌ హమాలీ కూడా మేమే ఇస్తున్నాం. అయినా వెంట వెంటనే గోదాంలకు మొక్కజొన్న బస్తాలను తరలించడం లేదు. ఇప్పుడైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలి. – రియాజ్‌, రైతు, వేణిసోంపురం

అన్‌లోడ్‌ చేసేందుకు హమాలీల కొరత ఎక్కువగా ఉంది. దీని వలన గోదాంల వద్ద మొక్కజొన్న లారీలు రెండు, మూడు రోజులు నిలపాల్సి వస్తోంది. అయిజలో రెండు గోదాంలు ఉన్నాయి. ఎలాగోలా వాహనాల్లో మొక్కజొన్న బస్తాలను తరలించైనా గోదాంల వద్ద అన్‌లోడింగ్‌ చేసేందుకు సరిపడా మంది హమాలీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రంలో నిల్వలు పేరుకుపోతున్నాయి. సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటాం. – చంద్రమౌళి, మార్క్‌ఫెడ్‌ డీఎం

గుదిబండగా మారిన గన్నీ బ్యాగుల సమస్య

గోదాంలకు తరలింపులోనూ ఇక్కట్లు

కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన వేలాది బస్తాలు

Advertisement
 
Advertisement
Advertisement